● టీజీఎఫ్‌ఐ ప్రతినిధులు
సిరిసిల్ల: కళాకారుల ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ(టీజీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సిరిసిల్ల కాలేజీ మైదానంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజీఎఫ్‌ఐ అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ సత్తార్ మాట్లాడారు. తెలుగు ఫోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తొలిసారి వివిధ రంగాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కవులు, కళాకారులు, టెక్నీషియన్లు, కెమెరామెన్లు, సినీ రంగంలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని వివరించారు. సిరిసిల్ల పాత బస్టాండ్ నుంచి కళాకారుల భారీ ర్యాలీ ప్రారంభమై సభా వేదిక వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నమోదు చేసుకున్న కళాకారులకు వరుస క్రమంలో పాటలు అవకాశం ఇస్తామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కళాకారులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. సీనియర్ కళాకారులకు నెలవారీ పెన్షన్, ఆరోగ్య బీమా సదుపాయం, నిరుపేద కళాకారులకు పక్కా ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, సీనియర్ కళాకారుల పిల్లలకు ఉచిత విద్య సదుపాయం కల్పించాలని కోరారు. టీజీఎఫ్‌ఐ ప్రతినిధులు దరువు అంజన్న, గజ్వేల్ వేణు, జడల రమేశ్, ఆకునూరి దేవయ్య, కాపర్తి మల్లికార్జున్, మంకాల ప్రసాద్, పాత శ్రీధర్, చీకోడు నరసింహులు, తేలు విజయ, శిరీష, ఎడమల శ్రీధర్‌రెడ్డి, నక్క శ్రీకాంత్‌యాదవ్, నవీన్, చిత్తారమ్మ మల్లేశం, శ్రీధర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


