● రైతుబీమా కోసం ఎదురుచూపులు ● అప్పుల ఊబిలో అన్నదాత కుటుంబం ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
వీర్నపల్లి: నిరుపేద రైతు మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. ఇంటి బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, వ్యవసాయ పనులు కుటుంబ సభ్యులపై పడ్డాయి. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి దూరం కావడంతో ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు దిక్కుతోచని వారయ్యారు. ప్రభుత్వం రైతుబీమా సొమ్ము అందక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.
రూ.6 లక్షల వరకు ఖర్చు
రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భావుసింగ్‌నాయక్‌తండా పంచాయతీ పరిధిలోని గోల్యనాయక్ తండాకు చెందిన బట్టు ధన్‌సింగ్ తల్లి లక్ష్మితోపాటు ఇద్దరు భార్యలు సునీత, స్రవంతి, పిల్లలు భారతి, మహిమ, రవి, రాకేశ్, ఆకాశ్, అలేఖ్యలతో కలిసి ఉండేవాడు. కుటుంబానికి ఉన్న 37 గుంటల భూమిపై ఆధారపడి జీవించసాగారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకావడంతో రూ.6లక్షల వరకు అప్పు చేసి పనులు చేశారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న ధన్‌సింగ్ గత నెలలో మృతిచెందడంతో వారు దిక్కులేని వారయ్యారు. రైతుబీమా రూ.5లక్షలు వస్తేనే అప్పుల నుంచి గట్టెక్కుతామని ఆ కుటుంబం పేర్కొంటుంది. పేద కుటుంబానికి అండగా నిలిచి, వారి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.


