● పాటల పల్లకిలో సిరిసిల్ల ● నేడు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు ● తరలివస్తున్న రెండు వేల మంది కళాకారులు
ఆర్కెస్ట్రా నుంచి యూట్యూబ్ ఆల్బమ్‌ల దాకా..
సిరిసిల్లలో ఆర్కెస్ట్రా బృందాలే కాదు.. యూట్యూబ్‌లో ఆల్బమ్‌లను తీర్చిదిద్దే సంగీత దర్శకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టెక్నీషియన్లు ఉన్నారు. కార్మికక్షేత్రంలో పురుడు పోసుకున్న పాటలెన్నో ఎల్లలు దాటి ప్రఖ్యాతిగాంచాయి. ‘బలగం’ సినిమాలో ‘హరి హరి రాఘవులే.. అయ్యే బాలి బాలి’ అంటూ.. ఆ సినిమా దర్శకుడు యెల్దండి వేణు రాగం ఎత్తితే... ప్రేక్షకులు కన్నీరు పెట్టారు. ‘కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో..’ అంటూ.. జీ.ఎల్.నాందేవ్ అందించిన సంగీతం ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించింది. ‘అమ్మ నేను బోతున్న లంకలోనికి.. సీతమ్మ జాడ తేవడానికి’ అంటూ.. జడల రమేశ్ అందుకున్న గానం ఎల్లలు దాటింది. ‘ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. గుచ్చే పూల బాణాలు..’ అంటూ శిరీష జానపదానికి మహిళాలోకం పట్టం కట్టింది. కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన మాట్ల తిరుపతి రాసిన పాటలు సాహిత్యకారులను మన్ననలు పొందాయి.
సినారె బాటలో..
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతంలోని సంగీత దర్శకులు, గాయనీ, గాయకులు సంగీతం ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి.. ‘నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని’ అంటూ మొదలుపెట్టిన పాటల ప్రపంచంలో ఎందరో యువరచయితలు తమదైన శైలితో దూసుకెళ్తున్నారు. ‘వద్దంటే ఎములాడ పోతాను అంటవే.. పొల్లగాని గుండు ఆడ గీకిత్తనంటవే’ అంటూ.. సుద్దాల బాలయ్య చేసిన గానం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. సిరిసిల్ల ప్రాంత కళాకారులు పది కాలాలపాటు గుర్తుండిపోయే పాటలకు పురుడు పోయగా.. ఇక్కడి జనం పాటకు పల్లకీ కట్టి గౌరవించారు.
సిరిసిల్ల: తెలంగాణ మట్టి జానపదాల తొట్టి. రోజురోజుకు జానపద సాహిత్యం సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతోంది. భక్తి.. భుక్తి.. ఉద్యమశక్తిగా నిలిచింది పల్లెపాట. సినిమా పాటలైనా.. లలిత సంగీతమైనా.. విషాద గీతమైనా.. పాటల పల్లకీలో జానపదం ఊరేగుతోంది. జానపదాల పూదోటలో వికసించిన కళాకారులు నేడు వస్త్రోత్పత్తి ఖిల్లాలో కలుసుకుంటున్నారు. పల్లెపాటకు పల్లకీ పడుతున్నారు. రెండు వేల మంది కళాకారులు మంగళవారం సాయంత్రం సిరిసిల్లలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ వేదికగా జానపద పాటలకు పట్టం కడుతున్నారు. రాష్ట్రంలోని సంగీత కళాకారులు ఏకమై తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ తొలి వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.


