పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఉన్న చారిత్రక ఖిల్లాలను సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు ఆదివారం చేపట్టిన సీతమ్మలొద్ది ట్రెక్కింగ్ కు అనూహ్య స్పందన లభించింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారు నుంచి మొదలైన ట్రెక్కింగ్ 9 కిలోమీటర్ల మేర సాగింది. 560 మంది ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. సీతమ్మ లొద్దికి చేరుకునే మార్గమధ్యంలో ఉన్న పిడుగుతొర్ర, భీమన్న ఆలయం లాంటి చారిత్రక ప్రదేశాలను తిలకించారు. వాటి విశిష్టతను పురావస్తు అధికారి బీఎన్‌రెడ్డి వారికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, పర్వతారోహకుడు మహిపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, మార్కెటింగ్ డీడీఎం పద్మావతి పాల్గొన్నారు.
ప్రకృతి ఒడిలో విజ్ఞాన యాత్ర
.కరీంనగర్‌టౌన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 45 మంది ప్రధానోపాధ్యాయులు ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతం, కడెం ప్రాజెక్టును సందర్శించారు. విద్యా విజ్ఞాన యాత్రలో భాగంగా చేపట్టిన ఈ పర్యటనలో ప్రకృతి అందాలను,జింకలు, ఇతర వన్యప్రాణులను అటవీ సఫారీ వాహనాల్లో పర్యటించి వీక్షించారు. వివిధ వృక్షజాతులు, జీవవైవిధ్యం, అడవుల సంరక్షణ ఆవశ్యకతను తెలుసుకున్నారు. అనంతరం అటవీ మ్యూజియాన్ని సందర్శించారు. విజ్ఞాన యాత్ర మధురానుభూతులను మిగిల్చిందని వారు పేర్కొన్నారు.


