ఆర్మూర్: ఇజ్రాయెల్, రష్యా దేశాల్లో వర్క్ వీసాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్‌ను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఆర్మూర్‌కు చెందిన షేక్ తాహా పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి ఇతర దేశాలకు పంపుతామంటూ అనుమతి లేకుండా పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్, నందిపేట్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, ముగ్పాల్ తదితర మండలాలతోపాటు కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలలోని నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇజ్రాయెల్, రష్యా తదితర దేశాలకు పంపిస్తానని, వర్క్ వీసాలు ఇప్పిస్తానని చెప్పి, ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. సరైన వీసాలు ఇవ్వకుండా, కొందరికి విజిట్ వీసాలు ఇచ్చి, మరికొందరికి వీసాలు ఇవ్వకుండా పాస్‌పోర్టులు దగ్గర పెట్టుకొని మోసం చేసి తిరుగుతున్నాడు. ఈ విషయమై పలువురు బాధితులు షేక్ తాహాపై ఫిర్యాదు చేశారని, దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. విచారణ చేసిన అనంతరం షేక్ తాహా నుంచి కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచామన్నారు. షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.
ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడి మృతి
కరీంనగర్‌క్రైం: నగరంలోని జ్యోతినగర్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నెగంటి ప్రసాదరావు(70) మృతిచెందాడు. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం ప్రసాదరావు తన కుమార్తెను వావిలాలపల్లిలోని వివేకానంద కళాశాలలో దింపి బైక్‌పై తిరిగి వస్తుండగా కెమిస్ట్ భవన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు కనకరత్నకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


