కొత్తపల్లి(కరీంనగర్)/పెద్దపల్లి: అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సరఫరాను పునరుద్ధరించేందుకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ సర్కిల్ నుంచి ప్రత్యేక బృందాలను ఏపీలోని అమలాపురం ప్రాంతానికి పంపించారు. కరీంనగర్ సర్కిల్ నుంచి 13 బృందాల్లోని 131 మంది విద్యుత్ సిబ్బంది, ఐదుగురు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో మరమ్మతుల కోసం శుక్రవారం కరీంనగర్ నుంచి బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు నాలుగు ఆకర్ మిషన్లు, ఐదు వాహనాలను కూడా పంపించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతు చేపట్టి, వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఈ బృందాలు సేవలందించనున్నాయని కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు సహకరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మేరకు ఏపీకి వెళ్లే విద్యుత్ సిబ్బంది వాహనాలకు శుక్రవారం జెండా ఊపీ ఎస్‌ఈ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖకు చెందిన డీఈలు, ఏడీలు, ఏఈలు, ఉపేందర్, రాజం, రవి, ప్రదీప్ ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.


