ధాన్యం దైన్యం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దైన్యం

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

బియ్యం వ్యాపారం తీరిలా

క్వింటాల్‌ రూ.3,500 పలికిన ధాన్యం తగ్గుదల

కిలో రూ.50 నుంచి 85కు పెరిగిన బియ్యం ధర

బియ్యం, ధాన్యం క్రయ విక్రయాల్లో సిండికేట్‌

నామమాత్రంగా ధరల నియంత్రణ కమిటీ

పెరుగుతున్న ధరలతో సామాన్యుడి విలవిల

బియ్యం పిరం..

జిల్లా మొత్తం జనాభా: 11లక్షలు

కుటుంబాలు: 3.50లక్షలు

రైస్‌డిపోలు: సుమారు 3,550

మిల్లులు: 160

బియ్యానికి పెంచిన ధర క్వింటాల్‌కు: 3,000(సుమారు)

కుటుంబానికి సగటున 3 నెలలకు వినియోగం: క్వింటాల్‌

ధరలు ఇలాగే సాగితే వ్యాపారులకు లాభం: రూ.105కోట్లు

రెండు నెలల క్రితం జై శ్రీరామ్‌ బియ్యం కిలో రూ.50 ఉండేది. ఎల్‌నినో అనే ప్రకటన రాగానే సిండికెట్‌గా మారిన ధరలను పెంచేశారు. ప్రస్తుతం కిలో రూ.85కు విక్రయిస్తున్నారు. అంటే అంతలోనే రూ.35పెంచేశారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: పంటసాగుకు పడే కష్టం ఒక ఎత్తయితే.. ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో ఎదుర య్యే సమస్యలు మరో ఎత్తు. మరోవైపు మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ధాన్యం కొనుగోలు ధరకు, వినియోగదారుడు బియ్యం కోసం చెల్లించే ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ ప్రయోజనం ఎవరికి దక్కుతోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గంటల్లోనే వ్యాపారులు రూ.లక్షలు సంపాదిస్తుంటే అన్నదాత అదేస్థాయిలో దోపిడీకి గురవుతున్నాడు. ఎల్‌నినో ప్రభావమంటూ తొలుత ధరలను పెంచేసి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు తీరా సిండికేట్‌గా మారి మద్దతు ధరకు కొంత ఎక్కువ ఇచ్చి భారీ మొత్తంలో నిల్వ చేస్తున్నారు.

ధాన్యం, బియ్యానికి భారీ వ్యత్యాసం

ప్రభుత్వం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441, గ్రేడ్‌–ఏ ధాన్యం రూ.2,461 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. గత మార్కెటింగ్‌ సీజన్‌లో సాధారణ రకం ధాన్యానికి రూ.2,369, గ్రేడ్‌–ఏ ధాన్యానికి రూ.2,389 చెల్లించారు. ఇవే ధరలతో కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం ఇష్టారీతిగా పెంచేశారు. ధాన్యం నుంచి బియ్యం తయారై వినియోగదారుడి చేతికి చేరే వరకు అనేక ఖర్చులున్నాయని చెప్పి ధరలను పెంచడం విమర్శలకు తావిస్తోంది.

కలెక్టర్‌ గారూ.. స్పందించరూ

రైతుకు గిట్టుబాటు ధర అందకపోవడం, వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం రెండూ సమస్యలే. ఈ రెండింటి మధ్య ఉన్న సరఫరా వ్యవస్థను సమీక్షించి, అనవసర ఖర్చులు లేదా అన్యాయమైన లాభాలు ఉంటే గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎల్‌నినో ప్రభావం.. ఆహార భద్రతపై అప్రమత్తత అవసరమని, ఉత్పత్తి తగ్గితే రైతుకు నష్టం కలగకుండా చూడటంతోపాటు, బియ్యం ధరలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో ఽవరి కోతలు ఊపందుకున్నాయి. వారం రోజుల క్రితం పచ్చి వడ్లనే క్వింటాల్‌కు రూ.3500 ఇచ్చి కొనుగోలు చేశారు. పంట మార్కెట్‌ను ముంచెత్తే క్రమంలో రూ.2,600కు పరిమితం చేశారు. ఇతర జిల్లాలో రూ.4వేల వరకు ధర పలుకుతుండగా సిండికేట్‌గా మారిన వ్యాపారులు రైతును ముంచుతున్నారు.

బియ్యం ధరలను పెంచి లాభపడేది.. ధాన్యం ధరలు తగ్గించి రూ.కోట్లు గడించేది వ్యాపారులే. అక్కడ సామాన్యులపై భారం పడుతుండగా ఇక్కడ రైతులను లూటీ చేస్తున్నారు. ఏసీల్లో కూర్చునేవారే ధరలను శాసిస్తుంటే ఎండలో చెమటోడ్చే రైతులు, సామాన్యులే బలిపశువులవుతున్నారు. ఇంత జరుగుతున్నా యంత్రాంగం చర్యలు శూన్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement