విద్యుత్‌ ఆదా చేద్దాం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఆదా చేద్దాం

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

కెపాసిటర్లు తప్పనిసరి 683 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్‌ లైన్ల సామర్థ్యం పెంపు ఎల్‌నినోను ఎదుర్కొంటాం

కరువు సవాళ్లను ఎదుర్కొందాం

ఇందులో రైతులు, ప్రజలు భాగస్వామ్యం కావాలి

వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు తప్పనిసరి

‘ఎల్‌నినో’ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు

‘సాక్షి’తో టీజీఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఐరెడ్డి విజేందర్‌రెడ్డి

కొత్తపల్లి(కరీంనగర్‌): ‘ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు రెట్టింపై, విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశముంది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం టీజీఎన్‌పీడీసీఎల్‌ ముందస్తు చర్యలు చేపట్టింది. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కరెంట్‌ ఆదాలో రైతులు, ప్రజలు భాగస్వామ్యం కావాలి’ అని కరీంనగర్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఐరెడ్డి విజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోవు వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌శాఖ ఎదుర్కొనే సవాళ్ల గురించి శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు.

రైతులు వ్యవసాయ మోటార్లకు ఐఎస్‌ఐ కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. స్టార్‌ రేటెడ్‌ మోటార్లు, పీవీసీ పైపులు వినియోగించాలి. ఆటో స్టార్టర్లను తొలగించి విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి. కెపాసిటర్ల వినియోగంతో పవర్‌ ఫ్యాక్టర్‌ మెరుగుపడి విద్యుత్‌ వ్యవస్థపై అనవసర భారం తగ్గుతుంది.

కరీంనగర్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో 33 కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయ లైన్ల ఏర్పాటు, 26/11 కేవీ ఫీడర్లలో ఓవర్‌లోడ్‌ నివారణకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో నూతన సబ్‌స్టేషన్లు ప్రారంభించాం. మరో 11 ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. 683 నూతన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్‌ అవసరాల కోసం మరిన్ని అదనపు, సామర్థ్య పెంపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం.

అధిక విద్యుత్‌ లోడును తట్టుకునేలా 69 కిలోమీటర్ల 33 కేవీ లైన్ల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాం. 11 కేవీ మున్సిపల్‌ లైన్లను, 1,190.08 కిలోమీటర్ల గ్రామీణ విద్యుత్‌లైన్లను అధిక సామర్థ్యం కలిగిన కండక్టర్లతో మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్పందించేందుకు డివిజన్‌, సర్కిల్‌, కార్పొరేట్‌స్థాయిలో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ అందుబాటు ఉంది. విద్యుత్‌ ఫిర్యాదుల కోసం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ వినియోగించుకోవాలి.

ఎల్‌నీనో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ సరఫరాలో అంతరాయాలు తగ్గించేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. విద్యుత్‌శాఖ చేపడుతున్న చర్యలకు తోడు రైతులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు కరెంట్‌ను ఆదా చేసి కరువ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకరించాలి. గృహ వినియోగదారులు ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వినియోగించాలి. అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, స్టాండ్‌బై ఉపకరణాలను మెయిన్‌ స్విచ్‌ ద్వారా ఆఫ్‌ చేయాలి. వీలైన వారు రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. పారిశ్రామిక సంస్థలు విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉండే పీక్‌ అవర్స్‌లో భారీ యంత్రాల వినియోగాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు ఆఫ్‌పీక్‌ సమయాలకు మార్చుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement