కరీంనగర్ టౌన్: ఆర్టీసీ రాష్ట్ర గుర్తింపు సంఘంగా గెలుపొందిన ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో కరీంనగర్ రీజియన్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ తమపై నమ్మకంతో 5వేల మెజారిటీతో గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కార్మికుల విధులు రాత్రి 8 గంటల్లోపు ముగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందన్నారు. రీజియన్ గౌరవాధ్యక్షుడు కంది అశోక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి.సంజీవ్ కార్మికుల సమస్యలపై పోరాడుతామని తెలిపారు. సభకు బి.కాళిదాస్ అధ్యక్షత వహించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కరీంనగర్–1, 2డిపోల్లో యూనియన్ జెండాలు ఆవిష్కరించారు. రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్.ప్రకాశ్, కె.కొమురయ్య, ప్రవీణ్ కుమార్, బాలు, బి.మహేశ్, లక్ష్మణ్, మహిళా నాయకులు సుజాత, లక్ష్మి, రజిత పాల్గొన్నారు.


