● అంతలోనే లారీ రూపంలో మృత్యువు ● రోడ్డు ప్రమాదంలో మల్లేపల్లి యువకుడు దుర్మరణం ● కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల ధర్నా
మంథని: మరోనాలుగు రోజు ల్లో పుట్టినరోజు జరుపుకోవా ల్సిన ఆ యువకుడిని లారీ మృత్యురూపంలో కబళించింది. తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో తీరని విషాదం నింపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
దాహం తీర్చుకునేందుకు వెళ్లి..
మల్లేపల్లి గ్రామానికి చెందిన చింతల నవీన్(21) మంథనిలోని ఓ పండ్ల(ప్రూట్) దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం పాత పెట్రోల్ బంక్ సమీపంలో తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో దాహం వేయడంతో రోడ్డు అవతలి వైపు వెళ్లి తిరిగి తన బండి వద్దకు నడుచుకుంటూ వస్తుండగా కాటారం వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ లారీ టైరు కింద పడటంతో శరీరం నుజ్జునుజ్జయింది. కళ్లముందే జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
తల్లికి ఆసరాగా..
చింతల వినోద– రాయమల్లుకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురుకు వివాహం కాగా.. కుమారుడు నవీన్ అవివాహితుడు. ఇతడి తండ్రి అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యాడు. తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుటుంబ బాధ్యతల్లో తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు నవీన్.. ఫ్రూట్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబం కోసం శ్రమిస్తున్న ఆ తల్లికి కొడుకే ధైర్యం. అలాంటి కుమారుడు ఒక్కసారిగా దూరం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
న్యాయం చేయాలంటూ ధర్నా
యువకుడి మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు, కు టుంబ సభ్యులు బాధిత కుటుంబానికి న్యాయం చే యాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి పెద్దపల్లి –కాటారం ప్రధాన రహదారిపై పెట్రోల్ బంకు కూడలి వద్ద ధర్నాకు దిగారు.లైదు గంటలకుపైగా ఆందోళన సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ఏసీపీ రమేశ్ ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని ధర్నా విరమింపజేశారు.


