● కరీంనగర్లో రూ.28కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు
కరీంనగర్‌క్రైం: యూనిక్ మెర్కంటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్వయం మల్టీస్టేట్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేర్లతో పెట్టుబడుల మోసానికి పాల్పడినట్లు నమోదైన కేసులో ఐదుగురిని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కై లాష్ రాయ్‌ను ఆదిలాబాద్ పోలీసులు ఇప్పటికే జైలుకు పంపగా.. హైదరాబాద్‌కు చెందిన గుడిపాటి గాంధీ, మాకలసోంపల్లి కరియప్ప, ఉల్లిగడ్డల సంగప్ప, నిజామాబాద్‌కు చెందిన కొమిరె భూమాగౌడ్, పెద్దపల్లికి చెందిన యేదెళ్ల రమేశ్‌ను ఆదివారం కరీంనగర్ పోలీసులు అరెస్టు చూపారు. వీరు నెలవారీ పెట్టుబడి పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్, హోటల్ వెకేషన్ ప్యాకేజీల పేరుతో అధిక ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని నమ్మించి ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించినట్లు విచారణలో తేల్చారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లు, ప్రాంతీయ ఇన్చార్జిల ద్వారా పెట్టుబడులు సేకరించినట్లు తెలిపారు. పథకాల గడువు 2019లో ముగిసినప్పటికీ సొమ్ము తిరిగి చెల్లించలేదని, కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ 2020లో సంస్థ కార్యకలాపాలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో బాధితులకు సుమారు రూ.26కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకు నష్టం జరిగినట్లు దర్యాప్తులో తేల్చారు.


