కరీంనగర్‌టౌన్: జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, హత్యాయత్నానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో గాయపడి, చేతులు విరిగిన బాధిత జర్నలిస్టులను సోమవారం కరీంనగర్‌లో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భూ తగాదాల విషయంలో పోలీసుల జోక్యంపై కథనాలు ప్రచురించిన రిపోర్టర్లపై అక్రమ కేసులు నమోదు చేసి, గంభీరావుపేట ఎస్సై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు సదరు జర్నలిస్టులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటన ఉన్నతాధికారులకు తెలియకుండా జరిగిందా? డీజీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఎస్సై దాడికి పాల్పడ్డారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హా మీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శేఖర్, విశ్వం, చంద్రశేఖర్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.


