కరీంనగర్‌అర్బన్: రానున్న సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమానికి గంట ముందు పెండింగ్ దరఖాస్తులపై సమీక్షిస్తానని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. ప్రతీ అర్జీ పరిష్కరించాల్సిందేనని నిర్దేశించారు. అప్పటివరకు శాఖల వారీగా లాగిన్‌లో ఉన్న అర్జీలు పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లా శాఖల అధికారులను ఆదేశించారు. ఇదిలాఉండగా బతుకమ్మ, దసరా పండుగల క్రమంలో సెలవుల వాతావరణం, పండగ వాతావరణమే కనిపించగా ప్రజలు ప్రజావాణి లేక వెలవెలబోయింది. కలెక్టర్ అర్జీలు స్వీకరించగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో జె.స్వామి దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 44 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కరీంనగర్ కార్పొరేషన్, కరీంనగర్ ఆర్డీవో, హుజూరాబాద్ ఆర్డీవోలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉండగా మిగతా శాఖలకు సంబంధించి ఒకటి, రెండు మాత్రమే వచ్చాయని సమాచారం.
మైనారిటీ కార్యాలయంలో అక్రమాలు
మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఓ వ్యక్తి 2017 నుంచి మైనారిటీ సంక్షేమ శాఖ, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నుంచి అధికారిక నియామక ఉత్తర్వులు లేకుండానే డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. జూలై 2025లో విచారణ జరిగినా తొక్కిపెట్టారు. అర్హులైన పేదలకు అందించాల్సిన కుట్టు మిషన్ల పంపిణీలోనూ అక్రమాలు జరిగాయి. లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసి అనర్హులకు అందజేశారు.
– షబానా మహమ్మద్, కాంగ్రెస్ నేత
మొత్తం అర్జీలు: 44, కరీంనగర్ కార్పొరేషన్: 19
కరీంనగర్ ఆర్డీవో: 07, హుజూరాబాద్ ఆర్డీవో: 07


