తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కొత్తపల్లిలో సోమవారం కన్నుల పండువగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంఘం చౌరస్తా, కొత్తవాడ, రెడ్డిరాంపల్లి, గోకుల్‌నగర్ కుర్మవాడ, పద్మనగర్, గాంధీ విగ్రహం తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కొత్తపల్లి బాపూజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సంఘం అధ్యక్షుడు పొన్నం సత్యనారాయణగౌడ్ దంపతులు, 17,18వ డివిజన్ల కార్పొరేటర్లు వాసాల రమేశ్, వేముల కవిత చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. – కొత్తపల్లి


