శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన రైతు పొలం విషయంలో భార్యతో గొడవపడి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పండగపూట విషాదం నింపింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. కరీంపేటకు చెందిన నాంపెల్లి సాంబయ్య(55) పొలం ఎండిపోతుండడంతో బాధతో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతడి భార్య శోభ, కుమారులు అజయ్, శ్రావణ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని రాత్రి 10.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. మద్యం తాగి వచ్చిన భర్తను చూసి శోభ పండుగపూట ఎందుకు తాగావని ప్రశ్నించింది. పొలం ఎండిపోతుంటే బాధతో మద్యం తాగానని సాంబయ్య చెప్పి రాత్రి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయి పొలం సమీపంలోని వాగు పక్కన చెట్టుకు ఉరేకున్నాడు. సాంబయ్య కోసం కొడుకులు, మరో వ్యక్తితో కలిసి వెతికారు. అర్ధరాత్రి సమయంలో వాగు పక్కన చెట్టుకు సాంబయ్య వేలాడుతూ కనిపించాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.


