‘గ్రీన్‌ ఎనర్జీ’లో అ‘ద్వితీయం’ | - | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌ ఎనర్జీ’లో అ‘ద్వితీయం’

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

కోనేరుపల్లికి జాతీయ ఘనత

ఇంతకు ముందు క్రీడామిత్ర పోటీలో మొదటిస్థానం

ఆరు నెలల్లో రెండోసారి..

ఆదర్శ సర్పంచ్‌గా నిలుస్తున్న రాజు

చొప్పదండి: ఊరు చిన్నదే కానీ.. ఘనత గొప్పది అన్న చందంగా నిలుస్తోంది కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామం. దేశవ్యాప్తంగా సర్పంచుల మధ్య నిర్వహిస్తున్న సర్పంచ్‌ సంవాద్‌ కాంటెస్టుల్లో ఆరు నెలల వ్యవధిలో జాతీయస్థాయిలో ఓ సారి మొదటి, మరోసారి రెండోస్థానంలో నిలిచి సర్పంచ్‌ కాసు వేణుగోపాలరాజు తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శంగా నిలిచారు.

ఏమిటీ సంవాద్‌ యాప్‌..?

దేశంలోని సర్పంచ్‌లందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూపొందించిన ఒక వినూత్న మొబైల్‌ అప్లికేషన్‌. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఈ యాప్‌ను అభివృద్ధి చేయగా, దేశవ్యాప్తంగా ఉన్న 12.68 లక్షల గ్రామ పంచాయతీల సర్పంచులను డిజిటల్‌గా అనుసంధానించి వారి మధ్య ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలుగు, ఇంగ్లిష్‌, హిందితో పాటు తొమ్మిది భాషలలో దీనిని రూపొందించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమాచారం ఒకేచోట లభిస్తుంది. గుడ్‌ గవర్నెన్స్‌ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి నెలా సర్పంచులలో పోటీ తత్వాన్ని, అభివృద్ధి పనుల్లో పారదర్శకతను పెంచడానికి యాప్‌ ద్వారా ప్రత్యేకమైన పరిపాలనా పోటీలు నిర్వహిస్తున్నారు.

500 లోపు జనాభా

కోనేరుపల్లి చిన్న గ్రామం. 2011 లెక్కల ప్రకారం 436 జనాభా ఉంటుంది. ఇందులో పురుఫులు 220 కాగా, మహిళలు 216 మంది ఉన్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్నప్పటికి గత డిసెంబర్‌లో సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌ రాజు, పాలకవర్గం తమదైన శైలిలో పరిపాలన సాగిస్తుండటం, డిజిటల్‌ శక్తిని సద్వినియోగం చేసుకుంటుండటంతో గ్రామానికి గుర్తింపు వస్తోంది. గ్రామంలో వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, ప్లాస్టిక్‌ నిషేధం, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలో చెక్‌డ్యాం నిర్మించి కరువుకాలంలోనూ నీటిని ఒడిసి పట్టారు. గ్రామ శివారులో రూ. కోట్ల విలువైన సోలార్‌ పవర్‌ ప్లాంటును ఏర్పాటు చేయించారు. రూ. కోటి ఇరువై లక్షలతో బీటీ రోడ్డు వేయిస్తున్నారు. రూ. 75 లక్షలతో వేణుగోపాలస్వామి గుడిని నిర్మించారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేశారు.

సోలార్‌ సిస్టంతో ద్వితీయం

గ్రీన్‌ ఎనర్జీ సంవాద్‌ కార్యక్రమాన్ని క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ నెలలో నిర్వహించింది. గ్రామ పంచాయతీల్లో పునరుత్పాదక ఇందన వనరుల వినియోగాన్ని పెపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన పోటీలో సర్పంచ్‌ రాజు పాలక వర్గం, గ్రామస్తుల ప్రోత్సాహంతో సౌరశక్తి వాడకాన్ని వీడియోలు తీసి యాప్‌లో పోస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ద్వితీయ స్థానంలో నిలిచి నగదు బహుమతిగా రూ. 20 వేలు గెలుచుకున్నాడు. గ్రామ శివారులో రూ. 6 కోట్ల వ్యయంతో 6 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు స్థానిక రైతులను ఆయన ఒప్పించి ప్రాజెక్టు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement