తరుగు దందా.. ఆగేదుందా! | - | Sakshi
Sakshi News home page

తరుగు దందా.. ఆగేదుందా!

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

● ధాన్యం కొనుగోళ్లు.. దృష్టిసారిస్తేనే మేలు ● ఆన్‌లైన్‌ ట్రక్‌షీట్‌ ఉత్తమం ● అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

కరీంనగర్‌ పరిధిలోని గోపాల్‌పూర్‌కు చెందిన సత్యం గత యాసంగి సీజన్లో 775 బస్తాల్లో 310 క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేసి రైస్‌మిల్‌కు పంపారు. మిల్లర్‌ 765 బస్తాలు.. 306 క్వింటాళ్ల ధాన్యం వచ్చినట్లు ట్రక్‌ీషీట్‌ ఇచ్చారు. పది బస్తాలు తరుగు చూపారు.

కరీంనగర్‌ అర్బన్‌: వానాకాలం ధాన్యం మరోవారం రోజుల్లో కోతకు రానుంది. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 1న కేంద్రాలు ప్రారంభించినప్పటికీ.. కోతలు ఆలస్యమవుతుండగా చివరి వారంలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని ల క్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటే వారికి మేలు జరిగే అవకాశముంది.

విచ్చలవిడిగా మిల్లర్ల మోసాలు

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారు. కేంద్రానికి సమీపంలోని మిల్లులకు ధాన్యం కేటాయించినందుకు ఒక్క లారీకి రూ.5 వేలు కేంద్రాల నిర్వాహకులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు మిల్లర్లు తూకంలో వ్యత్యాసాలు చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే ఒక్క లారీకి రూ.3 వేలను మిల్లర్లు కేంద్రాల నిర్వాహకులకు గతంలో ఇచ్చినట్లు సమాచారం. వీటిని అధిగమించాలంటే మిల్లులకు ధాన్యం కేటాయింపులపై కలెక్టర్‌ దృష్టిసారించడం ఉత్తమం.

తేమశాతంలో తేడాలు

కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యంలో తేమశాతం పరిశీలించిన తర్వాత తూకం వేయాల్సి ఉంటుంది. కొన్ని యంత్రాలు కచ్చితమైన తేమను చూ పించడం లేదు. ఒకే కుప్పలోని ధాన్యాన్ని ఒక యంత్రం ఒక విధమైన శాతాన్ని చూపిస్తే.. మరో యంత్రం మరో విధంగా చూపించిన ఘటనలు గతంలో జరిగాయి. అలాంటి యంత్రాలను గుర్తించాలి.

తూకాల్లో వ్యత్యాసం

కేంద్రాల్లో తూకం వేసి రైతు నుంచి సేకరించిన ధా న్యాన్ని రైస్‌ మిల్లుకు పంపుతారు. అక్కడ తూకంలో వ్యత్యాసం వస్తుంది. మిల్లర్లు ఇచ్చే ట్రక్‌షీట్‌లో ఒక్కలారీలో 4 నుంచి 10 సంచుల వరకు తరుగు గతంలో రావడం గమనార్హం. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన తూకం యంత్రాల్లో లోపం ఉందా..? లేదా మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కాంటాల్లో లోపం ఉందా..? అనే విషయాలపై దృష్టిసారించాలి.

గన్నీ సంచులు.. లారీలు

ధాన్యం తూకం వేసేందుకు, మిల్లులకు తరలించేందుకు అంచనాకు తగ్గట్టు గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలి. గతంలో వాటి కొరత కారణంగా రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సంచులు వచ్చేలోపు వాతావరణం అనుకూలించక అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు తూకం వేసిన ఉత్పత్తులు వెంట వెంటనే మిల్లులకు చేరాలంటే లారీల కొరత ఉండొద్దు. మిల్లులకు వెళ్లిన లారీల్లోని ధాన్యం త్వరగా ఖాళీ అయ్యేలా చూడాల్సిన అవసరముంది.

ఆన్‌లైన్‌ ట్రక్‌షీట్‌ ఉత్తమం

మిల్లర్ల తరుగు, అవుటర్న్‌ పేరిట దోపిడీకి చెక్‌ పెట్టేందుకు ఆన్‌లైన్‌ ట్రక్‌ షీట్‌ విధానాన్ని అమలు చేయాలి. కాంటా సమయంలో కొనుగోలు కేంద్రంలోనే రైతు సమక్షంలోనే ఆన్లైన్‌ ట్రక్‌షీట్‌ జనరేట్‌ చేయడం వల్ల మిల్లర్లు ధాన్యంలో కోత పెట్టే అవకాశమే ఉండదు. మాన్యువల్‌ ట్రక్‌ షీట్‌ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్‌ విధానం అమలు అత్యవసరం. నాణ్యత పేరుతో మిల్లర్లు తరుగు దోపిడీ చేసేందుకు పాత విధానం అవకాశమిస్తోంది. ప్రతి లారీలో క్వింటాళ్ల కొద్దీ కోత పెట్టడంతో క్వింటాళ్ల కొద్ది ధాన్యం నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం

: 3,36,761 ఎకరాలు

జిల్లాలో సాగైన వరి: 2,75,716 ఎకరాలు

రానున్న దిగుబడి: 4.90లక్షల

మెట్రిక్‌ టన్నులు

కొనుగోలు కేంద్రాలు: 318

కనీస మద్దతు ధర: రూ.2,461

సాధారణ రకం: రూ.2,441

మొత్తం కొనుగోలు కేంద్రాలు: 318

ఐకేపీ: 91, పీఏసీఎస్‌: 182

డీసీఎంఎస్‌: 37, హాకా: 08

జిల్లాలో రైస్‌ మిల్లులు: 169

రా రైస్‌ మిల్లులు: 82

బాయిల్డ్‌ రైస్‌మిల్లులు: 87

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement