రేషన్‌ బియ్యం.. సన్నాయి నొక్కులు! | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం.. సన్నాయి నొక్కులు!

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● బ్రాండెడ్‌ సంచులతో బురిడీ ● రైస్‌డిపోల ద్వారా విక్రయం ● రెండింతల లాభం.. అధికారులకు వాటా

కరీంనగర్‌ అర్బన్‌: రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బ్రాండెడ్‌ రంగులు అద్దుకుంటోంది. కార్డుదారులు, డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఽబియ్యాన్ని ఫాలిషింగ్‌ చేసి బ్రాండెడ్‌ పేరిట రంగు సంచులతో బురిడీ కొడుతున్నారు. కాదు.. కాదు.. దర్జాగా దందా చేస్తూ జనాలను పిండుతున్నారు. మంగళవారం ఏకంగా జిల్లా కేంద్రంలోని హన్‌మాన్‌ ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో సదరు బాగోతం వెలుగుచూడగా నిర్వాహకుడు తొడుపునూరి కరుణాకర్‌పై కేసు నమోదు చేశారు. అయితే గతంలోనే ‘సాక్షి’ మినీలో ‘రంగు సంచుల మాయ’ శీర్షికన జరుగుతున్న మోసాన్ని స్పష్టం చేసింది. బ్రాండ్ల పేరుతో సంచులను ముద్రించడం, అందులో పాలిషింగ్‌ చేసిన సన్న బియ్యాన్ని నింపి వన్‌టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతాల్లోని పలు రైస్‌డిపోలకు తరలించి వినియోగదారులకు అంటగడుతున్నారు. వేల క్వింటాళ్లు సన్న బియ్యం పేరుతో విక్రయాలు సాగుతుండగా నిలువరించాల్సిన యంత్రాంగం ఏం చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. అధికారిక సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో హోలోగ్రామ్‌ ఉన్న బియ్యం బ్రాండ్‌ ఒక్కటీ లేదు. మార్కెట్‌లో మాత్రం వివిధ రకాల పేర్లతో కొన్ని వందల బ్రాండ్లు పుట్టుకొస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌, హోలోగ్రామ్‌ లేని వారు రకరకాల పేర్లతో సంచులు తయారు చేసుకుని బియ్యాన్ని అధిక ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. కరీంనగరంలో రెండేళ్ల కిందట 300 వరకు రైస్‌డిపోలుండేవి. కాలక్రమేణా వేయి వరకు వెలిశాయి.

మాఫియాలా బియ్యం వ్యాపారం

జిల్లాలో మిల్లర్లు ఆడిందే ఆటగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూపర్‌ఫైన్‌ క్వాలిటీ ఉండే బియ్యాన్ని కిలో రూ.30 మించి బహిరంగ మార్కెట్లో విక్రయించకూడదు. ఇది మచ్చుకై నా అమలు కావడం లేదు. రకరకాల పేర్లు పెట్టుకుని ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ధరలు నిర్ణయించుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఓ పేరు మోసిన బ్రాండ్‌ కిలో బియ్యాన్ని రూ.60లకు అమ్ముతుంటే ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేని మరికొంత మంది బ్రాండ్‌ అమ్మకందారులు కిలో బియ్యం రూ.55 తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు. 25కిలోల బియ్యం రూ.1300 నుంచి రూ.1500 వరకు పలుకుతోంది. పంట పండించే రైతు నుంచి 75 కిలోల ధాన్యం బస్తాను రూ.1500లకు మించి కొనుగోలు చేయని వ్యాపారులు వారు తయారు చేసే బియ్యం విషయంలో మాత్రం ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. 25కిలోల బస్తా 23, 24 కిలోలే ఉంటుండగా తూనికలు కొలతల శాఖ చర్యలు మాత్రం శూన్యం

మిల్లులే రంగుల సంచులకు అడ్డాలు

మిల్లులే రంగు సంచులకు అడ్డాలుగా మారుతున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో సంచులను మిల్లుల్లో నిల్వ చేసుకుని కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని పాలిషింగ్‌ చేసి వీటిలో నింపుతున్నారు. రైస్‌డిపోలతో బేరం కుదుర్చుకుని సదరు బియ్యాన్ని బ్రాండ్ల రూపంలో విపణికి వదులుతున్నారు. భువనగిరి, మిర్యాలగూడ నుంచి బియ్యం దిగుమతి చేసుకునే వ్యాపారులు ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్నారు. రాత్రిళ్లు వేబిల్లు లేని వాహనాలతో బియ్యం రవాణా చేస్తున్నారు.

రేషన్‌ బియ్యంతో దందా

జిల్లాలో 2.70 లక్షల ఆహారభద్రత కార్డుదారుల కోసం ప్రతి నెలా ప్రభుత్వం వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయిస్తోంది. ఇందులో సుమారు 10వేల క్వింటాళ్లకు పైగా బియ్యం దళారుల ద్వారా రైస్‌మిల్లులకు చేరుతున్నాయి. గతంలో మిల్లర్లే డీలర్ల నుంచి కిలో రూ.10 చెల్లిస్తే డీలర్‌కు చేరకుండానే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి కిలో రూ.15కు కొనుగోలు చేసేదీ. ప్రస్తుతం అడ్డుకట్ట పడటంతో పలువురి బ్రోకర్ల ద్వారా కార్డుదారుల నుంచి డీలర్ల నుంచి బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలిస్తున్నారు. ఇలా వెళ్తున్న వాటిని పునఃప్రక్రియ చేసి బ్రాండ్ల పేరుతో బహిరంగ మార్కెట్‌లోకి వదులుతున్నారు.

రంగు

సంచులు చూశారుగా.. ఇవే మనం దుకాణాల్లో తీసుకునే సన్న బియ్యం బస్తాలు. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ఆకర్షణీయంగా

సంచులను ముద్రించడం వాటిలో బియ్యం నింపడం.. జనాలను దోచుకోవడం దర్జాగా సాగుతోంది.

ఇది నగరంలోని ఓ రైస్‌మిల్లు. వివిధ రకాల ట్యాగులను తగిలించి బియ్యాన్ని నింపుతున్నారు. వివిధ బ్రాండ్లతో సంచులుండగా అందులో నింపే బియ్యం మాత్రం ఒకటే.

చర్యలు చేపడతాం

రేషన్‌ బియ్యంతో దందా చేసేవారిని వదలం. తనిఖీలు చేసి దొరికితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. కార్డుదారులు బియ్యాన్ని విక్రయిస్తే కార్డు రద్దు చేస్తాం.

– గట్టు నర్సింగరావు,

జిల్లా పౌరసరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement