కరీంనగర్: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజగోపాల్‌రావు తెలిపారు. మంగళవారం పీసీ అండ్ పీఎన్‌డీటీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో గర్భస్థ శిశువు ఆడ, మగా అనే విషయాన్ని గర్భిణి లేదా కుటుంబ సభ్యులకు వెల్లడించడం నేరమని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని డీఎంహెచ్‌వో కార్యాలయానికి తెలియజేయాలని, సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కేంద్రాల్లో ‘లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం’, ‘పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అని వెల్లడించరాదు’ అనే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. సమావేశంలో వైద్యులు సనా జవేరియా, పద్మజ, కళ్యాణి, దివ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


