గంటకే ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

గంటకే ఆగమాగం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

నగరంలో దంచికొట్టిన వాన పలు ప్రాంతాల్లో ముంచెత్తిన వరద కాలువలను తలపించిన వీధులు చెరువులుగా మారిన రోడ్లు, కూడళ్లు ఇళ్లలోకి చేరిన మురుగు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరాన్ని వరద ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం కొద్దిసేపు కురిసిన భారీ వర్షంతో నగరం జలమయమైంది. చాలా ప్రాంతాల్లోని వీధులు, రోడ్లు కాలువలను తలపించాయి. ఇండ్లల్లోకి వరద చేరింది. డ్రైనేజీలు సక్రమంగా లేని ప్రాంతాల్లో మురుగు రోడ్డెక్కింది. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలు చేపట్టారు.

ఉక్కపోత.. కుండపోత

నగర ప్రజలను ఆదివారం ఉదయం ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయగా, మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా, మరికొన్ని చోట్ల సాధారణంగా వర్షం పడింది. దాదాపు గంట పాటు పడిన భారీ వర్షంతో ముకరంపుర, మంచిర్యాల చౌరస్తా, జ్యోతినగర్‌, మంకమ్మతోట, లక్ష్మినగర్‌, గణేశ్‌నగర్‌, సాయినగర్‌, కాశ్మీర్‌గడ్డ తదితర ప్రాంతాల్లో రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. సాయికృష్ణ థియేటర్‌ సమీపంలో ఇళ్లలోకి వరద నీళ్లు చేరాయి. ముకరాంపుర విమానం వీధి ఏరియాలో మామూలుగానే వీధులు, ఇండ్లు నీట మునిగాయి. లక్ష్మినగర్‌లోని నయూం మసీదు ప్రాంతంలో డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగు పారింది. గీతాభవన్‌ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాలు మళ్లీ చెరువులను తలపించాయి. వరద, బురద కారణంగా ఆయా ప్రాంతాల్లోని నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలి

వర్షంతో ప్రజలు ఇబ్బంది పడకుండా, అత్యవసర సేవలకు అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి సందర్శించారు. 31, 52, 53, 59, 60, 64వ డివిజన్‌లలో పర్యటించి, వర్షపు నీళ్లు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, తొలగించాలని అధికారులను ఆదేశించారు. డిజాస్టర్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్పొరేటర్లు పడాల శ్రీజ అజయ్‌గౌడ్‌, కొంపెల్లి శ్వేత రామన్‌, మాజిద్‌ హుస్సేన్‌, బియాబని ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement