సమయం లేదు గణేశా! | - | Sakshi
Sakshi News home page

సమయం లేదు గణేశా!

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

● కొత్తపల్లి చెరువులో గుర్రపు డెక్క ● నిమజ్జనంపై భక్తుల్లో ఆందోళన

కొత్తపల్లి: కొత్తపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జన వేడుకలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు కొనసాగుతున్నా.. చెరువులో విస్తరించిన గుర్రపు డెక్క సంకటంగా మారింది. గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించినప్పటికీ.. ఆశించినస్థాయిలో పురోగతి కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. యంత్రాలతో పనులు చేపట్టినా గుర్రపు డెక్క పూర్తిస్థాయిలో తొలగకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతోంది. నిమజ్జనానికి గడువు సమీపిస్తున్న వేళ పనులను వేగవంతం చేయాల్సి ఉంది.

పొదలతోనూ ఇబ్బందులే

చెరువు కట్టకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. చెట్ల పొదలను పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో నిమజ్జనా నికి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చే సమయంలో పొదలతో కట్ట పరిధి తెలియక అదుపు తప్పేందుకు ఆస్కారం ఉంది.

వేదిక మార్పుతో ట్రాఫిక్‌ తిప్పలు?

కొత్తపల్లి చెరువు వద్ద ఈ ఏడాది నిమజ్జన వేదికను చెరువు కట్టపైకి మార్చడంతో ట్రాఫిక్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌– జగిత్యాల ప్రధాన రహదారి నుంచి కట్టపైకి వాహనాలను మళ్లించే క్రమంలో రద్దీ ఏర్పడే అవకాశముంది. ఒకే వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగాల్సి ఉండటంతో నిమజ్జనం సమయంలో ట్రాఫిక్‌ సమస్య మరింత పెరగనుంది. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ నిర్వాహకుల వాహనాలతో పాటు సాధారణ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడనుంది.

నిమజ్జనానికి మూడు రోజులే

వినాయక నిమజ్జనానికి మూడు రోజులే గడువు ఉండటంతో ఏర్పాట్లపై భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిమజ్జన ప్రాంతంలో గుర్రపు డెక్కను పూర్తిస్థాయిలో తొలగించడంతో పాటు వాహనాల రాకపోకలకు మార్గాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చివరి నిమిషంలో హడావుడి చేయకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే నిమజ్జనం ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంటుంది. గుర్రపు డెక్క, చెట్ల పొదల తొలగింపు, ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు, వినాయక ఉత్సవ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement