కరీంనగర్‌అర్బన్: ఉల్లి ధర ఘాటెక్కింది. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సెంచరీకి చేరువైంది. ఎల్‌నినో ప్రభావం.. బ్లాక్ మార్కెట్ నేపథ్యంలో ధర ఆకాశన్నంటగా విస్తుపోవడం వినియోగదారుని వంతవుతోంది. ధరలను నియంత్రించాల్సిన విభాగం మొద్దునిద్రలో జోగుతుండడంతో మరికొన్ని రోజుల్లో పండగలు ఎలా చేసుకునేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఎల్‌నినో.. కృత్రిమ కొరత
జిల్లాలో ఉల్లిగడ్డ వినియోగం ఎక్కువ. నిత్యం 40 టన్నుల విక్రయాలు జరుగుతుండగా వ్యాపారుల ఎత్తుగడ మొదలైంది. గత నెలలో ఉల్లి కిలో రూ.30 పలుకగా నెల రోజుల వ్యవధిలోనే రూ.90కి చేరడం ఆందోళనకర పరిణామం. కర్నూలు, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అయ్యేది. ఎల్‌నినోతో పంట సాగు తగ్గిందని తెలుస్తోంది. పలుచోట్ల అధిక వర్షాల క్రమంలో ఉల్లిని సాగు చేసిన రైతులు వాటిని ఆరబెట్టేందుకు వీలు కాకపోవడంతో పంటను తీయడం లేదు. దీంతో సరఫరా బాగా తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. ఉల్లి సరఫరా కొంత తగ్గగానే హోల్‌సేల్ వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దుకాణాల్లో ఉన్న ఉల్లిని రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు కొరత సృష్టిస్తున్నారని చిరు వ్యాపారులు వివరించారు.
రాయితీపై సరఫరా జరిగేనా?
గతంలో ఉల్లి గడ్డ రూ.90 దాటగా ప్రభుత్వమే రాయితీపై సరఫరా చేసింది. రేషన్ కార్డుల ద్వారా కిలో రూ.50కి విక్రయించారు. జిల్లాలో విరివిగా కౌంటర్లు ఏర్పాటు చేసి పౌరసరఫరాల, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో ఉల్లిగడ్డలు విక్రయించాయి. ఎల్‌నినో నేపథ్యంలో పనులు అంతంతమాత్రమే కాగా సకల వర్గాల ఆర్థిక పరిస్థితి అంతంతే. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే బాసటగా నిలవాల్సిన అవసరముంది.
ఉల్లి ధర (కిలోకు)..
హోల్‌సేల్
తెల్ల ఉల్లిగడ్డ: రూ.80
ఎర్ర ఉల్లిగడ్డ: రూ.70
రిటేల్
తెల్ల ఉల్లిగడ్డ: రూ.90
ఎర్ర ఉల్లిగడ్డ: రూ.80


