మురుగు.. రోడ్డుపై పరుగు | - | Sakshi
Sakshi News home page

మురుగు.. రోడ్డుపై పరుగు

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

మురుగు.. రోడ్డుపై పరుగు ● అధ్వానంగా బైపాస్‌ రోడ్డు ● పట్టింపులేని నిర్వహణ సంస్థ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరం నుంచి వెళ్లే రాజీవ్‌రహదారి మురుగునీటితో అధ్వానంగా మారింది. హైవే రోడ్డు వెంట డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో దుకాణ దారులు, నివాసితులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ కూడా సాధ్యం కాని దుస్థితికి డ్రైనేజీ చేరడంతో, కొత్తగా నిర్మించడం తప్ప మరో దారి లేని పరిస్థితి నెలకొంది. కానీ, హైవే నిర్వహణను చూడాల్సిన సంస్థ ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలమవుతోంది.

మూసుకుపోయిన పాత డ్రైనేజీలు

హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్‌రహదారి నగరంలోనూ బద్దం ఎల్లారెడ్డి జంక్షన్‌ నుంచి బొమ్మకల్‌ బైపాస్‌ వరకు కొనసాగుతుంది. ఈ బైపాస్‌ వెంట డ్రైనేజీ నిర్వహణ సరిగా లేక డర్టీ హైవేగా మారింది. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డు వెంట మురుగు నిలవడం సర్వ సాధారణంగా మారింది. రోడ్డు వెంట ఉన్న దుకాణదారులు తమ వ్యాపారాలు కొనసాగించే క్రమంలో అక్కడక్కడా ఉన్న పాత డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో మురుగు డ్రైనేజీలకు వెళ్లలేక రోడ్డెక్కుతున్నాయి. నగరంలో రాజీవ్‌రహదారి బైపాస్‌ దిగువ ప్రాంతంలో ఉండడంతో సహజంగానే ఎగువ ప్రాంతంలోని మురుగు, వరదనీళ్లు బైపాస్‌కు వస్తుంటాయి. డ్రైనేజీ లేకపోవడంతో రోడ్డు వెంట రోజుల తరబడి మురుగు ఉంటోంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింతగా ఉంటోంది.

శాశ్వత నిర్మాణాలే పరిష్కారం

హైవే వెంట మురుగునీళ్లు నిలిచిపోవడంతో, డ్రైనేజీలను తెరిచేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడడం లేదు. రోడ్డు వెంట ఎక్కువగా ఆటోమొబైల్‌ షాప్‌లు ఉండడం, వాటి వ్యర్థాలు డ్రైనేజీల్లో పేరుకుపోవడంతో జెట్‌మిషన్‌లు పెట్టినా డ్రైనేజీ పునరుద్ధరణ కావడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైవే నిర్వహణ చేయాల్సిన హెచ్‌కేఆర్‌ సంస్థ కొత్తగా డ్రైనేజీలు నిర్మిస్తే తప్ప పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదు. రోజుల తరబడి రోడ్డు వెంట మురుగునీళ్లు నిలిచి ఉండడం, వర్షం పడితే నీళ్లు సగం రోడ్డును ఆక్రమించడం బైపాస్‌లో నిత్యం జరుగుతున్న తంతు. ఇప్పటికై నా నిర్వహణ అధికారులు హైవే వెంట మురుగునీళ్లు నిలవకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement