చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 18లో గల నాలుగెకరాలు వక్ఫ్ పరిధిలో చేర్చడం అన్యాయమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బాధితులను ఆదివారం కలిసి మాట్లాడారు. 60 ఏళ్ల క్రితం అన్నం రాజు కుటుంబీకుల వద్ద రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల్లో గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నాక ఇప్పుడు వక్ఫ్ పరిధిలోని భూమి అంటు 2020లో రికార్డుల్లో చేర్చడం ఏంటని ప్రశ్నించా రు. ఖాస్రా పహాణీల నుంచి ధరణి పోర్టల్ వరకు రికార్డుల్లో పట్టా కాలమ్, కబ్జా కాలంలలో నమోదు కాగా, అకస్మాత్తుగా భూమిని వక్ఫ్ బోర్డు ఖాతాలో ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. సర్వే నంబర్ 18లో వక్ఫ్ బోర్డు పేరు తొలగించి బాధితుల పేర్లు నమోదు చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు మొగిలి మహేశ్, తోట కోటేశ్, ఎడ్ల సురేశ్, దొంతిసారపు సంపత్, పెద్ది వీరేశం, ఓర్గల తిరుపతి, బాధితులు బియ్యాల వెంకటేశ్, సందనవేని కొమురయ్య, లంక చంద్రమౌళి, దాడి మల్లయ్య, కొమురయ్య, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త క్రీడను పరిచయం చేసిన కరీంనగర్
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా నుంచి కొత్త క్రీడను పరిచయం చేయడం అభినందనీయమని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల డీవైఎస్‌వోలు శ్రీనివాస్ గౌడ్, సురేశ్‌కుమార్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మొలంగూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ముఫాజిల్ అహ్మద్ రూపొందించిన ఫీల్డ్ బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల బుక్‌ను ఆదివారం ఫిలింభవన్‌లో ఆవిష్కరించారు. 2030 కామన్‌వెల్త్, 2036 ఒలింపిక్ ఈవెంట్లకు ఆతిథ్యమిస్తున్న తరుణంలో కొత్త క్రీడను పరిచయం చేయడం గర్వ కారణం అన్నారు. టీఎస్ పెట అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, టీజీపెట అధ్యక్షుడు అంతటి శంకరయ్య, పీపీఈటీఏ అధ్యక్ష,కార్యదర్శులు బత్తిని శ్రీధర్‌గౌడ్, గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
నవోదయ దరఖాస్తుకు మరోచాన్స్
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలోని తొమ్మిది, పదకొండో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 30వరకు దరఖాస్తు చేసే అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదోతరగతి చదువుతున్న వారు, వచ్చే ఏడాది తొమ్మిదో తరగతిలోకి, పదోతరగతి చదువుతున్న వారు పదకొండో తరగతిలోకి ప్రవేశం పొందేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 10న నిర్వహిస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


