గంగాధర: వ్యాపారం చేద్దామని డబ్బులు తీసుకొని సొంతానికి వాడుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన అర్కుటి కొమురయ్య శుక్రవారం సాయంత్రం సెల్ టవరెక్కాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. కురిక్యాలకు చెందిన జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారం చేద్దామని కొమురయ్య వద్ద 2012లో రూ.24 లక్షలు తీసుకొని సొంతానికి వాడుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని కొమురయ్య ఒత్తిడి చేయగా 2015లో ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. 2016లో డబ్బులు చెల్లిస్తా ఇంటికి రమ్మని ప్రామిసరీ నోటు తీసుకున్నాడని కొమురయ్య ఆరోపించాడు. డబ్బులు అడిగితే శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతడి సోదరుడు నర్సింహారెడ్డి, తండ్రి నారాయణరెడ్డి బెదిరిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. తనకేమైన జరిగితే రూ.24 లక్షలు బాకీ ఇచ్చిన డబ్బుతో పాటు, తన కుటుంబానికి నష్టపరిహారంగా రూ.కోటి ఇప్పించాలని నోట్ రాశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని కొమురయ్యను కోరగా, డబ్బు ఇచ్చే వరకు దిగనని అక్కడే ఉన్నాడు. అప్పు విషయమై పోలీసులు, శ్రీనివాస్‌రెడ్డిని ఫోన్‌లో ఆరా తీయగా, తాను డబ్బులు ఇచ్చేది లేదని, కొమురయ్య కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.


