దాచింది ఎందుకో! | - | Sakshi
Sakshi News home page

దాచింది ఎందుకో!

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

● కోర్టు ట్యాంక్‌ ఆవరణలో కొత్త ఆటోలు ● బల్దియా కొనుగోలు చేసి ఏడు నెలలు ● బేరం కుదరకే అప్పగించలేదంటూ ఆరోపణలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కొత్తగా కొనుగోలు చేసిన శానిటేషన్‌ వాహనాలు వినియోగంలోకి తీసుకురాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడు నెలల నుంచి కోర్టు ట్యాంక్‌ ఆవరణలోనే వృథాగా ఉన్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే క్రమంలో బేరం కుదరకనే ఉపయోగంలోకి తేవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొత్త వాహనాల కొనుగోలు

నగరంలో శానిటేషన్‌ పనులకు కొత్తగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. స్వచ్ఛ ట్రాక్టర్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ ట్రాక్టర్లపై డ్రైవర్లను నియమించే సమయంలోనూ శానిటేషన్‌ అధి కారులు కొందరు పోస్టులు అమ్ముకున్నట్లు, రూ.35 వేలు ఇస్తేనే డ్రైవర్‌గా నియమించారనే ఆరోపణలు వచ్చాయి. స్వచ్ఛ ఆటోల్లో కొన్ని వినియోగంలోకి తీసుకురాగా, ఐదు ఆటోలు గత ఏడు నెలలుగా కోర్టుట్యాంక్‌ ఆవరణలో వృథాగా పడి ఉండడం ఇప్పుడు వివాదంగా మారింది. ఇటీవల రెండు ఫాగింగ్‌ ఆటోలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్‌ కావడంతో పారిశుధ్య వాహనాల వినియోగం అధికంగా ఉంటుంది. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

బేరం కుదరకనే

బల్దియా డబ్బుతో కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోల నిర్వహణ భారం పడకుండా, ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్న ట్లు సమాచారం. ప్రైవేట్‌ వ్యక్తులు ప్రతి ఇంటి నుంచి రూ.50 వసూలు చేస్తుంటారు. మున్సిపల్‌ ఆటోలు వసూలు చేయవు. నగరపాలకసంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఆటోలను కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆటో డీజిల్‌, డ్రైవర్‌, లేబర్‌, నిర్వహణను తప్పించుకునేందుకు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తారు. సదరు వ్యక్తి ఇంటింటి నుంచి రూ.50 వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నగరవ్యాప్తంగా ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు రూ.50 వసూలు చేసే విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకొన్న కొంతమంది అధికా రులు అవినీతికి తెరతీశారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆటో అప్పగించాలంటే రూ.లక్ష కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని, రూ.లక్ష తమకు ఇవ్వాలంటూ బేరం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. బేరం కుదరక, కొన్ని ఆటోలను నెలల తరబడి వృథాగా ఉంచుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారు

– సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, మాజీ మేయర్‌

స్వచ్ఛ ఆటోలను ప్రైవేట్‌ వ్యక్తులకు రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారని మాజీ మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఆదివారం కోర్టుట్యాంక్‌ ఆవరణలోని వాహనాలను పరిశీలించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలు ప్రారంభం కాకముందే మరమ్మతులకు పోయేలా ఉన్నాయన్నారు. ఎంహెచ్‌ ఒక వాహనానికి రూ.2 లక్షలకు మాట్లాడుకున్నట్లు తమకు అనుమానం ఉందన్నారు. ఓ వైపు దోమలు విజృంభిస్తుంటే మరో వైపు ఫాగింగ్‌ మిషన్లు ప్రారంభించక పోవడం ఏంటని ప్రశ్నించారు. నగరపాలకసంస్థ కమిషనర్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement