కరీంనగర్‌క్రైం:గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. గణేశ్ మండపాల వద్ద సీసీ కెమెరాలు, వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట తదితర నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, విద్యుత్ సదుపాయం, గజ ఈతగాళ్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శోభా యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 12న నిర్వహించిన జాతీయ లోక్ అదా లత్‌లో కమిషనరేట్ పరిధిలో 4,268 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.
అర్బన్ బ్యాంకు సమావేశం వాయిదా
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేఽశం అనుకున్నట్లే వాయిదా పడింది. కోరం ఉంటేనే సమావేశం జరగాల్సి ఉండగా వన్ బై టెన్ హాజరుకావాల్సి ఉండగా సుమారు 1800 మంది వస్తే సర్వసభ్య సమావేశానికి అవకాశం ఉంటుంది. ఆదివారం స్థానిక అంబేద్కర్ మైదానంలో జరిగిన సమావేశానికి 300 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్, గంగాధర, జగిత్యాల బ్రాంచ్‌లకు సంబంధించి 8వేలకు పైగా సభ్యులున్నారు. కోరం నిండాలంటే మరో 1500 మంది అవసరం కాగా కొంత సేపు వేచిచూశారు. చివరికి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బ్యాంక్ సీఈవో శ్రీనివాస్ వెల్లడించారు. వాయిదా పడ్డ సమావేశాన్ని ఈ నెల 27న రెవెన్యూ గార్డెన్‌లో నిర్వహించాల్సిందిగా కోరుతూ జిల్లా సహకార అధికారికి లేఖ రాసినట్టు పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి వివరించారు. పీఐసీ సభ్యులు మడుపు మోహన్, లక్ష్మణరాజు, ముక్క భాస్కర్, అలుగు విద్యాసాగర్, మూల లక్ష్మి, మార్క రాజు, నాగుల సతీష్, మంగి రవి, షాముద్దీన్, సాయికృష్ణ, ముద్దసాని క్రాంతి పాల్గొన్నారు.
‘దళిత బంధు’ నేను తెప్పిస్తా
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గానికి రెండో విడత దళిత బంధు నిధులు ఎలా తెప్పి ంచాలో తనకు తెలుసని మాజీ మంత్రి, ఎంఎంఎస్ వ్యవస్థాపకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మాదిగల అత్మీయ సమ్మేళనంలో మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ హు జూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ నియోజకవర్గంలో దళితబంధు రెండో విడత రావడం లేదని పలువురు తనను కలిశారని, ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో చర్చించగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్వాతంత్య్రం నుంచి రెడ్లే సీఎంలు ఉన్నారని, మాదిగల ఓట్లతోనే గెలిచారన్నారు. రూ.10వేల కోట్ల విలువైన లీడ్ క్యాప్ భూములను కాపాడి మాదిగలకు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ప్రణవ్ మాట్లాడుతూ దళితబంధు నిధుల విడుదల ప్రక్రియ ను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం 8వేల మందికి నిధులు ఇవ్వకుండా ఓట్ల కోసం వాడుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో తిరిగి గ్రౌండింగ్ చేసి 5వేల మందిని గుర్తించిందన్నారు.
కరీంనగర్‌టౌన్: రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు మిల్లర్లు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. రైస్ మిల్ ఇండస్ట్రీపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.


