బయోమందుల దందా | - | Sakshi
Sakshi News home page

బయోమందుల దందా

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

కరీంనగర్‌ అర్బన్‌: జీవ ఎరువుల దందా కరీంనగర్‌ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎరువుల బస్తాలతో అంటగడుతూ మాటల గారడీతో జేబులు నింపుకుంటున్నారు. బయోఎరువులు, మందుల పేరుతో రూ.కోట్లలో దందా సాగుతుండగా నియంత్రించేవారే కరవవడం అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లో వాటి పేరిట నకిలీవి అంటగడుతుండగా వాస్తవానికి బయోఎరువులు అమ్మడం నిషేధమని అధికారులు చెబుతున్నారు. కానీ డీలర్లకు, కంపెనీలకు కాసుల వర్షం కురుస్తునే ఉంది. విక్రయాల పరిమితిని బట్టి ఏజెంట్లు, డీలర్లకు ప్రోత్సాహకాలు, టూర్లు వంటి ఆఫర్లు ఇస్తున్నారు. డీలర్లే వ్యాపారం చేస్తుండగా ఏఈవోలు, ఏవోలకు కంటపడలేదంటే ఆశ్చర్యమే.

రూ.లక్ష దాటితే టూర్లు, ప్యాకేజీలు

కరీంనగర్‌ అర్బన్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, మానకొండూరు, గంగాధర, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం, తిమ్మాపూర్‌ తదితర మండలాల్లోని ఫర్టిలైజర్‌ దుకాణాల నిర్వాహకులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కరీంనగర్‌లో హోల్‌సేల్‌ డీలర్లు ఉన్నారు. బడా కంపనీలకు హోల్‌సేల్‌ డీలర్‌గా వ్యవహరించే వ్యక్తే ఈ దందాలో కీలకమని స్పష్టమవుతోంది. విక్రయాలను బట్టి దుకాణ డీలర్లకు కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. సదరు ఎరువులు, మందులు అతి చౌక ధర కాగా వీరు మాత్రం పదింతలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. దానిపై ఉండే ఎంఆర్‌పీ ధరలో సగానికి పైగా డబ్బులు కమీషన్‌ రూపంలో ఇస్తుండటంతో దుకాణాల డీలర్లు వీటి విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. సదరు మందుల విలువ రూ.లక్ష దాటితే విహార యాత్రలు, విలువ గల బహుమతులను అందిస్తున్నారు. పలువురు డీలర్లను ఇటీవల గోవా టూర్‌కు తరలించి సకల మర్యాదలు చేశారన్న ఆరోపణలున్నాయి.

సందర్శనలు.. సమావేశాలు

రోడ్డును ఆనుకుని ఉన్న రైతుల పొలాలను ఎంపిక చేసి తమ కంపెనీల మందుల ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. గ్రామంలోని రైతులను మభ్య పెడుతూ పంటచేలలో క్షేత్రసందర్శనలు పెడుతూ తమ ఉత్పత్తుల వాడకంతో పంట ఏపుగా పెరిగిందంటూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. రైతులను పిలిచి రచ్చబండ వద్ద కుర్చీలు వేసి టీ, టిఫిన్లు పెట్టి పెద్దపెద్ద స్క్రీన్లపై రైతులతో మాట్లాడిస్తూ బయో ఉత్పత్తులు వాడేలా చూస్తున్నారు. వివిధ గ్రామాల రైతులను పిలిచి వారితోనే మాట్లాడించి బయో మందులు వాడమని చెప్పిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏఐ రూపొందిత రీల్స్‌, వీడియోలతో ఆకర్షణీయ ప్రకటనలూ చూపి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దుకాణదారులు అరువుపై మందులను ఇవ్వడం కూడా రైతులు బయోమందుల వైపు మొగ్గు చూపేలా సఫలీకృతులవుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్‌ తెలిపారు. బయో మందుల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదని, వాటిని రైతులు వినియోగించి నష్టపోవద్దని సూచించారు.

టార్గెట్‌ దాటితే టూర్లు, ప్యాకేజీలు

బోగస్‌ కంపెనీల రూ.కోట్ల వ్యాపారం

అన్నదాతల అమాయకత్వమే పెట్టుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement