చికిత్స పొందుతూ కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ కార్మికుడు మృతి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన జనగామ సతీశ్‌ (35) ఆర్థిక ఇబ్బందులతో 15 రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పుంటించుకోగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన సతీశ్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులకు స్తోమత లేకపోవడంతో సర్పంచ్‌ కొండ రమేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం రూ. 10వేల సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. సతీశ్‌ తనకు కేటాయించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ నివాసంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పుంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య మమత, కుమారుడు విగ్నేష్‌, కూతురు భవానిశ్రీ ఉన్నారు. సతీశ్‌ మృతితో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అదుపుతప్పి కిందపడి వ్యక్తి..

వేములవాడఅర్బన్‌: వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన చింతకుంట నర్సయ్య (60) ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం.. నర్సయ్య మంగళవారం కట్టెల కోసం ద్విచక్ర వాహనంపై అగ్రహారం శివారులోని గుట్టకు వెళ్లాడు. కట్టెలను ద్విచక్ర వాహనంపై పెట్టి గుట్ట దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

తీవ్రగాయలైన వ్యక్తి..

జమ్మికుంట: రైస్‌ మిల్లులో జరిగిన ప్రమాదంలో ఓ కూలికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని నాగంపేట గ్రామానికి చెందిన కన్నురి మొగిలి(50) పట్టణంలోని ఓ మిల్లులో గత నెల 29న కూలిపనికి వెళ్లాడు. రైస్‌మిల్లులోని డస్ట్‌ మిషన్‌ ప్రమాదవశాత్తు మీదపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమార్తె రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ తెలిపారు.

టిప్పర్‌ ఢీకొని ఒకరికి గాయాలు

మల్యాల: మండలంలోని రాజారం గ్రామ శివారులో బైక్‌ను టిప్పర్‌ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్‌ జిల్లా దేశాయిపేట గ్రామానికి చెందిన సందీప్‌ లింగంపేట రైల్వేస్టేషన్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం బైక్‌పై విధులకు వస్తున్నాడు. రాజారం సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద టిప్పర్‌ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సందీప్‌ తొడభాగం నుజ్జునుజ్జుయ్యింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

రాయికల్‌: రాయికల్‌ మండలం ఇటిక్యాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్‌ నాగార్జున తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement