కొడిమ్యాల: ఆయన రెండుసార్లు సర్పంచ్‌గా కొనసాగారు. పదేళ్లపాటు ప్రజాసేవకు పాటుపడ్డారు. పదిమందికి సహాయపడిన ఆయన చేతులు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఆయన.. దాతలు సాధ్యమైనంత సాయం చేయాలని వేడుకుంటున్నాడు. అతడే మండలంలోని తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ చెట్టుపల్లి హరేందర్. హరేందర్‌కి ఇద్దరు కూతుళ్లు. ఉన్నంతలో ఇద్దరికీ వివాహం చేశాడు. పదేళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగినప్పటికీ నయాపైసా కూడబెట్టుకోలేకపోయారు. కొద్దికాలంగా కడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంబారిన పడగా.. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఖర్చులు భారంగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇల్లు తప్ప ఏమిలేదని అతని సన్నిహితులు తెలిపారు. దాతలు స్పందించి తోచినంత సహాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు రూ.52వేల ఆర్థిక సహాయాన్ని ఆయన భార్యకు అందించారు. హరేందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హరెందర్ కుటుంబానికి దాతలు అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, కృష్ణారావు, వెంకటేష్, నరేందర్ రెడ్డి, మల్లేశం, మహేష్, సత్యం, మల్లేశ్ యాదవ్ కోరారు.
అనారోగ్యం బారిన తిరుమలాపూర్ మాజీ సర్పంచ్
వైద్య ఖర్చులకు చేయిచాస్తున్న హరేందర్
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం
ఇల్లు తప్ప గుంట భూమిలేక తల్లడిల్లుతున్న ఇల్లాలు


