ఏ–1గా మురళీధర్ రెడ్డి, మరో నలుగురిపై కేసు
ఒంటికి నిప్పంటించుకున్న రాజేందర్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి
అక్రమ కేసులతో వేధించారని కుటుంబసభ్యుల ఆరోపణ
కరీంనగర్‌లో మార్చురీ వద్ద నిరసన, గుండ్లపల్లి స్టేజీ వద్ద రాస్తారోకో
మురళీధర్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసుల లాఠీచార్జ్
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/తిమ్మాపూర్/గన్నేరువరం: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ఆత్మహత్యకు యత్నించిన బేతెల్లి రాజేందర్‌రెడ్డి మరణించాడు. ఈనెల 14వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకున్న రాజేందర్‌రెడ్డి బుధవారం రాత్రి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతని స్వగ్రామం గుండ్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అకారణంగా రాజేందర్‌రెడ్డిని పొట్టనబెట్టుకున్నారని ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురువారం ఉదయం సివిల్ ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. రాజేందర్‌రెడ్డి మరణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్‌రెడ్డే కారణమని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని మృతుని భార్య, గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతెల్లి సమత గంటపాటు నిరసనకు దిగారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్‌తోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబసభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.
రాసారోకో, పీఏ ఇంటి ముట్టడి.. లాఠీచార్జ్
మృతదేహంతో సహా గుండ్లపల్లి స్టేజీ రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అక్కడ నుంచి మురళీధర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముట్టడికి ప్రయత్నించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మృతుడి భార్య సమత మాట్లాడుతూ తన భర్త రాజేందర్‌రెడ్డి చావుకు ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డితో పాటు రవీందర్‌రెడ్డి, మరో ముగ్గురు కారణమని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో తన పిల్లలతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో రహదారికి ఇరువైపుల వాహనాలు స్తంభించాయి. అంత్యక్రియల సందర్భంగా రాజేందర్ రెడ్డి గ్రామానికి చేసిన సేవలను స్మరించుకుని పలువురు కంటతడి పెట్టారు. ఘటన నేపథ్యంలో మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, గుండ్లపల్లిలోని ఆయన పీఏ మురళీధర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ రమేశ్, ఎస్సై నరేందర్‌రెడ్డి బందోబస్తులో పాల్గొన్నారు.
రాజేందర్ రెడ్డి మరణానికి ఎమ్మెల్యే పీఏ మురళీధర్‌రెడ్డి వేధింపులే కారణమని మృతుని భార్య బెతెల్లి సుమత తెలిపారు. అతనితోపాటు బెజ్జంకి మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ సాధిక్, వంగల రవీందర్‌రెడ్డి, పైడిమాల మల్లేశం, బిగ్గుల్ల శ్రావణ్‌తో కలిసి అక్రమ అట్రాసిటీ కేసు పెట్టించడంతోనే తన భర్త మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు. సమత ఫిర్యాదు మేరకు కేసులో ఏ–1గా మురళీధర్‌రెడ్డిని పేర్కొన్న ఎల్‌ఎండీ పోలీసులు మరో నలుగురిపైనా కేసు నమోదు చేశారు.


