పది ఎకరాల్లో నాటు వేయిస్తున్న
మంథనిరూరల్: ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షాలు లేక ఆలస్యమైన వరినాట్లు ఒకేసారి ముమ్మరం కావడంతో రైతులు వలస కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు పక్క గ్రామాల్లోని కూలీలను ఉపయోగించుకోగా రెండేళ్లుగా జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. దీంతో ఇటు సమయం, అటు డబ్బు ఆదా అవుతుందనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు.
కూలీల కొరతతో..
వర్షాకాలం ప్రారంభమై ఖరీఫ్ సీజన్ పంటల సాగు మొదలైన క్రమంలో కూలీల కొరత రైతులను వెంటాడుతోంది. నాట్లు వేయడం, కలుపు తీయడంలాంటి పనులకు ఎక్కువగా కూలీలనే వినియోగిస్తుంటారు. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, రెండు రోజులుగా సాగు చేసుకునేలా వర్షం పడటంతో ఒకేసారి నాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో రైతులకు స్థానిక కూలీలు దొరకపోవడంతో వలస కూలీలతోనే నాట్లు వేయిస్తున్నారు.
ఆంధ్రా, బీహార్ నుంచి వలస
ఆంధ్రా, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన కూలీలను ఇక్కడకు తీసుకువచ్చి వరినాట్లు వేయిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కావు. ఈక్రమంలో ఉపాధి కోసం రెండు మూడేళ్లుగా ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. రెండు మాసాలు ఇక్కడ కూలీలు పని చేసి ఆగస్టు చివరి మాసంలో తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని ఓ వలస కూలీ తెలిపారు.
ఎకరాకు రూ.5వేలు చెల్లింపు
సాధారణంగా వరినాట్ల సమయంలో ఒక్కో కూలీకి రూ.300 నుంచి రూ.400ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎకరం పొలాన్ని 10–15 ఒకపూటలో నాటు వేస్తారు. కానీ వలస కూలీలు మాత్రం గుత్తగా ఎకరాకు రూ.5వేలు తీసుకొని నాటు వేస్తారు. ఒకరోజులో వలస కూలీలు పది మంది బ్యాచ్ సుమారు ఐదు ఎకరాల్లో నాటు వేస్తారని చెబుతున్నారు. లోకల్ కూలీలకంటే వలస కూలీలు వేగంగా నాట్లు వేయడం పట్ల రైతులు వారివైపు మొగ్గు చూపుతున్నారు.
పద్ధతి ప్రకారం నాటు వేయడంతోనే..
ఆంధ్రా, బీహార్, ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చే కూలీలు నాట్లు వేయడంతో శిక్షణ పొంది ఉంటారు. సాధారణంగా పంట దిగుబడి నాట్లు వేసే పద్ధతిపై కూడా ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. లోకల్ కూలీల కంటే వలస కూలీలు ఒక్క పద్ధతితో నాట్లు వేస్తారని, దీంతో పంట దిగుబడిపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఎక్కువగా రైతులు వలస కూలీలతో నాట్లు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పది ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్న. నాటు వేసేందుకు పొలం జంబు కొట్టి సిద్దం చేసిన. రెండేళ్లుగా వలస కూలీలతోనే నాట్లు వేయిస్తున్న. వారు ఒక పద్ధతిలో నాటు పెడుతరు. దీంతో వరి పంటకు ఎలాంటి తెగుళ్లు రావు. పిలకలను పద్దతిగా నాటకపోతే దోమపోటు వస్తుంది. వలస కూలీలతో నాటు వేయిస్తే ఎలాంటి నష్టం ఉండదు. పంట దిగుబడి కూడా బాగా వస్తుంది.
– గుమాసి వెంకటేశ్, రైతు, స్వర్ణపల్లి
వ్యవసాయ పనులకు కూలీల కొరత
ఆంధ్రా, బీహార్ కూలీలతో వరి నాట్లు
ఎకరాకు రూ.5వేలు చెల్లింపు


