యువకుడి ఆత్మహత్య.. ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య.. ఉద్రిక్తం

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లటౌన్‌: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్యతో స్వగ్రామంతోపాటు సిరిసిల్లలో హై అలర్ట్‌ నెలకొంది. ప్రధాని మోదీ తన మృతికి కారకుడిగా పేర్కొంటూ సూసైడ్‌నోట్‌ రాయడంతో మృతుడి స్వగ్రామం గొల్లపల్లి, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

గొల్లపల్లిలో బీఆర్‌ఎస్‌ ర్యాలీ

వంశీ ఆత్మహత్య చేసుకోగా.. వారి కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. ఆగయ్య మాట్లాడుతూ వంశీని కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. పేయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని, యువకుడి మృతితో ఆ కుటుంబం వీధిన పడిందన్నారు. యువకుడి కుటుంబానికి మద్దతుగా బీఆర్‌ఎస్‌ నాయకులు ఫ్లకార్డులతో ర్యాలీ తీశారు. సింగిల్‌విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కృష్ణహరి, సర్పంచ్‌ కొండ రమేశ్‌గౌడ్‌, అందె సుభాష్‌ ఉన్నారు.

అండగా ఉంటాం

వంశీ కుటుంబానికి అండగా ఉంటామని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గౌస్‌, శ్రీనివాసరెడ్డి, గుడ్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

సంగీతం పరామర్శ

మృతుడు వంశీ కుటుంబ సభ్యులను జిల్లా ఆస్పత్రి వద్ద డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కాగా మార్చురీ గదిలో ఉన్న వంశీ మృతదేహాన్ని చూడటానికి ఆస్పత్రి సెక్యూరిటీ కొద్ది సేపు ఒప్పుకోకపోవడం చర్చనీయాంశమైంది.

పోలీసుల మోహరింపు

తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లపల్లిలో పోలీసు బలగాలు మోహరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించాలని యువకులు భావించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సర్పంచ్‌ కొండ రమేశ్‌గౌడ్‌ జోక్యం చేసుకోవడంతో బస్టాండ్‌ నుంచి ఇంటి వరకు ర్యాలీగా తీసుకెళ్లారు.

రాచర్లగొల్లపల్లి, సిరిసిల్లల్లో బందోబస్తు

మృతుడి కుటుంబానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement