ఇష్టారాజ్యంగా వాహనాల కాంటా
ద్విచక్ర వాహనం నంబర్ చెబితే కూడా రశీదు జారీ
బొమ్మకల్ బైపాస్‌లో వేబ్రిడ్జి నిర్వాహకుల దోపిడీ
ద్విచక్రవాహనం నంబరుతో జారీ చేసిన వేబిల్లు
బొమ్మకల్ బైపాస్‌లోని వేబ్రిడ్జి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌లో వేబ్రిడ్జి నిర్వాహకుల తీరు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. వేబ్రిడ్జిపై వాహనాలను తూకం వేయకుండానే జారీ చేస్తున్న రశీదులతో వాహనాల యజమానులు దర్జాగా రవాణాశాఖ అధికారులను మోసగిస్తున్నారు. ద్విచక్రవాహనం నంబరుతో రశీదు జారీ చేయడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. బొమ్మకల్ బైపాస్‌రోడ్డులోని రెండు వేబ్రిడ్జిల్లో జరుగుతున్న అక్రమాలను గురువారం సమాచార హక్కుచట్టం కార్యకర్తలు వెలుగులోకి తెచ్చారు. రామగుండం– హైదరాబాద్ రోడ్డులో బొమ్మకల్ ఫ్‌లైఓవర్‌బ్రిడ్జి సమీపంలో రెండు వేబ్రిడ్జి కాంటాలున్నాయి. ప్రతిరోజు మంథని నుంచి హైదరాబాద్‌కు పెద్దసంఖ్యలో లారీలు ఇసుక రవాణా చేస్తుంటాయి. ఈ రెండు కాంటాల్లో లారీల్లోని ఇసుకను తూకం వేయకుండానే ఓవర్‌లోడ్ ఉన్నప్పటికి నిర్వాహకులు సాధారణలోడ్ ఉన్నట్లుగా రశీదు ఇస్తున్నారు. ఓవర్‌లోడ్ ఉన్నప్పటికీ అధికారులు వేబ్రిడ్జి రశీదును పరిశీలించి, జరిమానా విధించకుండానే వదిలేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ దందా కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.
ద్విచక్రవాహనం నంబరుతో కాంటా
బొమ్మకల్‌కు చెందిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యుడు జక్కుల భూమయ్య గురువారం వేబ్రిడ్జిల్లోని అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపించాడు. ఆయా వేబ్రిడ్జిల వద్దకు వెళ్లిన భూమయ్య ట్రాలీ ఆటో కాంటా వేయాలని చెప్పి తన ద్విచక్రవాహనం ఏపీ15ఏఎల్1922 నంబరు చెప్పాడు. ఆటో ఎక్కడ ఉందని అడగకుండానే మొత్తం బరువు 1,030 కిలోలు, ఖాళీ బరువు 530కిలోలు అంటూ నిర్వాహకులు రశీదు జారీ చేశారు. అనంతరం వేబ్రిడ్జిల్లోని తూకం అక్రమాలపై తూనికలు, కొలతలశాఖ అధికారికి భూమయ్య ఫిర్యాదు చేశాడు. సమగ్ర విచారణ జరిపించి చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని కోరాడు.


