ఉపాధి నిధుల ‘పంచాయతీ’ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి నిధుల ‘పంచాయతీ’

Jul 6 2026 7:00 AM | Updated on Jul 6 2026 7:00 AM

సీసీరోడ్ల పనుల కోసం వర్గపోరాటం కరీంనగర్‌ నియోజకవర్గానికి రూ.2.25 కోట్లు మంజూరు మొగ్ధుంపూర్‌లో కాంగ్రెస్‌ నాయకుల హోరాహోరీ నేడు గ్రామసభలో తీర్మానం

కరీంనగర్‌రూరల్‌: వర్గపోరుతో అభాసుపాలవుతున్న అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఉపాధిహామీ నిధుల మంజూరు వ్యవహారం కొత్త చిచ్చుపెట్టింది. గ్రామాల్లో ఉపాధిహామీ కింద మంజూరైన నిధులతో సీసీరోడ్డు పనులు తామే చేస్తామంటే తామే చేస్తామని స్థానిక నాయకులు ముందుకురావడంతో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. మొగ్ధుంపూర్‌లో పనులు చేపట్టేందుకు కాంగ్రెస్‌ అగ్రనాయకుల సిఫారసు లేఖలను ఇద్దరు తీసుకురావడంతో ఎవరికి గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు.

రెండు మండలాలకు రూ.2.25కోట్లు

ఉపాధి పథకం కింద కరీంనగర్‌ నియోజకవర్గంలో సీసీరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.2.25 కోట్లు విడుదల చేసింది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ప్రతిపాదనల మేరకు సీసీరోడ్ల నిర్మాణానికి కొత్తపల్లి మండలానికి రూ.కోటి, కరీంనగర్‌రూరల్‌ మండలానికి రూ.1.25కోట్లు కేటాయించారు. అయితే ఎమ్మెల్యే గంగుల బీఆర్‌ఎస్‌ సర్పంచులున్న తాహెర్‌కొండాపూర్‌, మందులపల్లె గ్రామాలకు రూ.15 లక్షల చొప్పున మంజూరు చేసినా సకాలంలో సీసీరోడ్ల నిర్మాణ ప్రాతిపదనలు పీఆర్‌ అధికారులకు పంపించకపోవడంతో రద్దు చేశారు. మిగతా గ్రామాలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కేటాయించారు.

పనుల కోసం వర్గపోరు

మొగ్ధుంపూర్‌లో సీసీరోడ్డు కోసం కేటాయించిన ఉపాధి నిధులు రూ. 10లక్షలు కాంగ్రెస్‌లో వర్గపోరుకు దారితీశాయి. పనులు చేసేందుకు మాజీ సర్పంచు జక్కం నర్సయ్య, కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు మీసాల సాయిలు పోటీ పడుతున్నారు. తన ప్రతిపాదన మేరకే కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నిధులు మంజూరు చేసిన దృష్ట్యా తానే పనులు చేస్తానంటూ నర్సయ్య పట్టుబడుతున్నాడు. సీనియర్‌ కార్యకర్తగా పని చేసేందుకు తనకు అవకాశమివ్వాలంటూ సాయిలు డిమాండ్‌ చేస్తున్నాడు. రాజేందర్‌రావు సిఫారసు లేఖను నర్సయ్య పంచాయతీ, పీఆర్‌ అధికారులకు అందించగా, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డి ద్వారా సాయిలు ఒత్తిడి తెస్తుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. చివరకు అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన వ్యక్తి మాత్రమే పనులు చేయాలంటూ సూచించారు. సోమవారం గ్రామసభ అనంతరం జరిగే పంచాయతీ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసిన వ్యక్తికి సీసీరోడ్డు పనులు చేసేందుకు అవకాశం కల్పిస్తామని పీఆర్‌ ఏఈ సమ్మయ్య తెలిపారు. మిగతా గ్రామాల్లో ప్రతిపాదనల మేరకు పనులు చేసేలా చర్యలు చేపట్టామని, ఒక్క మొగ్ధుంపూర్‌లో ఇద్దరు పోటీ పడడంతో సమస్య ఏర్పడిందని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement