డెడ్‌లైన్‌ గుబులు | - | Sakshi
Sakshi News home page

డెడ్‌లైన్‌ గుబులు

Jul 6 2026 7:00 AM | Updated on Jul 6 2026 7:00 AM

ఆగస్టు 8లోపు సీఎంఆర్‌ బకాయిలు ఇవ్వాల్సిందే అదనపు ర్యాక్‌ ఇవ్వాలంటున్న మిల్లర్లు గడువులోపు బకాయిలు వచ్చేనా.?

కరీంనగర్‌ అర్బన్‌: సీఎంఆర్‌ బకాయిలతో పాటు వేలం ధాన్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లు గడువుల మీద గడువులు పొడిగించగా ఇకపై పొడిగించకపోగా క్రిమినల్‌ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్‌వో ప్రభాకర్‌రావు మిల్లర్లతో సమావేఽశం నిర్వహించి 25శాతం పెనాల్టీ, వందశాతం సీఎఆర్‌ బకాయిలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మిల్లుల వారీగా బకాయిల జాబితాను రూపొందిస్తుండగా జూలు విదిల్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. అయితే అదనపు ర్యాక్‌లు కేటాయించాలని రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతుండగా, బకాయి ఉన్న సీఎంఆర్‌ ఇచ్చేందుకు మిల్లర్లు లాబీయింగ్‌ చేస్తూ ఇన్నాళ్లు కాలం గడపగా మరీ ఈ సారైనా ప్రభుత్వం వారి లాబీయింగ్‌కు లొంగకుండా బకాయి రాబడుతుందా.. వేచి చూడాల్సిందే.

గడువులోగా బకాయిలు వచ్చేనా?

జిల్లాలో 75 రైస్‌ మిల్లులు 1,15,328.906 టన్నుల ధాన్యం మరాడించి 77,562.786 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా వాటి విలువ రూ.278.58కోట్లు. సదరు బకాయిలతో పాటు వేలం వేసిన ధాన్యం బకాయి ఉన్న మిల్లులు 97 ఉంటే 93,844 మెట్రిక్‌ టన్నుల ధాన్యం బకాయిపడ్డారు. వేలం వేసిన ధాన్యం ఇవ్వకపోగా గత సీఎంఆర్‌ బకాయి తేలారు. సీఎంఆర్‌ బకాయిదారులకు 125 శాతం జరిమానాతోపాటు 12 శాతం వడ్డీతో బియ్యం లేదా నగదు చెల్లించడానికి మార్చి 26న రాష్ట్ర ప్రభుత్వం 90 రోజులపాటు అవకాశం కల్పించగా హూజూరాబాద్‌కు చెందిన ఓ మిల్లరు 200 టన్నుల ధాన్యం సీఎంఆర్‌ చెల్లించగా మరో ముగ్గురు నగదు రూపంలో చెల్లించినట్లు సమాచారం. మిగతా 71 మంది బకాయిదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మిల్లర్లకు గడువు గుబులు

మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని 2022–23వ సంవత్సరంలో వేలం వేశారు. ధాన్యం లేకపోవడం, కొన్ని చోట్ల బిడ్డర్లు ధాన్యం తీసుకోకపోవడం వల్ల ఈ పక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో రూ.వందల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. చాలా చోట్ల మిల్లర్లు అమ్మేసుకున్నారు. కొన్ని చోట్ల అలాగే నిల్వ ఉండటంతో నాణ్యత దెబ్బతింది. మరోవైపు ప్రభుత్వం మిల్లర్లకు 2026 రబీ సీజన్‌లో ధాన్యం కేటాయించింది. తాజాగా సీఎంఆర్‌ బకాయిలను ఆగస్టు 8 లోపు ఇచ్చేయాలని అధికారులు మిల్లర్లకు గడువు విధించారు. గడువులోపు బకాయిలు ఎలా చెల్లించాలని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు ఇవ్వని వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రవేశపెడుతామని అధికారులు చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదనపు ర్యాక్‌లకై మిల్లర్ల పట్టు

కరీంనగర్‌, జమ్మికుంట ఎఫ్‌సీఐ గోదాముల నుంచి సీఎంఆర్‌ బియ్యం సకాలంలో తరలించాలంటే అదనపు నాన్‌ ఎఫ్‌ఆర్‌కే రైల్వే ర్యాక్స్‌ అవసరమని మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. 2025–26 యాసంగి సీజన్‌లో కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 7.70లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా 5లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. కరీంనగర్‌, జమ్మికుంటలో గల ఎఫ్‌సీఐ గోదాంలలో నిల్వ స్థలం కొరతతో సీఎంఆర్‌ తరలింపు మందకొడిగా సాగుతోంది. సదరు సమస్యతో మిల్లుల్లో భారీగా నిల్వలు పేరుకుపోతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన యాసంగి ధాన్యానికి సెప్టెంబర్‌ 30 గడువు విధించగా ఆ లోపు డెలివరీ చేయకుంటే డిఫాల్టర్లుగా మారే అవకాశముందని మిల్లర్లు వాపోతున్నారు.

జిల్లాలో..

బకాయి ఉన్న మిల్లులు: 71

కేటాయించిన ధాన్యం:

1,15,328.906 మెట్రిక్‌ టన్నులు

ఇవ్వాల్సిన బియ్యం:

77,562.786మె.ట

వాటి విలువ: రూ.278.58 కోట్లు

వేలం వేసిన ధాన్యం బకాయి ఉన్న మిల్లులు: 97

ఇవ్వాల్సిన బియ్యం: 93,844 మె.ట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement