మొలకెత్తని ఆశలు | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని ఆశలు

Jul 2 2026 2:35 AM | Updated on Jul 2 2026 2:35 AM

వ్యవసాయంపై ఎల్‌ నినో ప్రభావం

భారీవర్షాల కోసం రైతుల ఎదురుచూపు

ఇంకా ప్రారంభంకాని వరినాట్లు

ఎక్కడా మొలకెత్తని పత్తి విత్తనాలు

సగానికి పడిపోయిన సాగు విస్తీర్ణం

అడుగంటిన భూగర్భ జలాలు

ఆందోళనలో అన్నదాతలు

సాక్షి, పెద్దపల్లి: కార్తెలు కరిగిపోతున్నా వానాకాలం సాగు ముందుకు సాగడంలేదు. జూన్‌ తొలివారంలోనే వర్షాలు విస్తారంగా కురిసి వివిధ పంటలతో పొలాలు పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తొలి జల్లులు పడగానే పత్తి విత్తనాలు వేసినా ఇంకా మొలకలు రాలేదు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వరి నాట్లు వేయాల్సిన సమయం దాటిపోతుండగా పొలాలు నీళ్లులేక ఎండిపోవడంతో రైతులు తమ ఆశలన్నీ భారీవర్షాలపైనే పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఎండల తీవ్రత, వర్షాల ఆలస్యంతో బావులు, బోర్లు నీరందించడం లేదు. చెరువులు, కుంటల్లో నీరులేక ఆయకట్టులోనూ సాగు ప్రారంభం కాలేదు. వర్షాధారం సాగుపైనే ఆధారపడే రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

పదిరోజులే వర్షం.. లోటు వర్షపాతం

జూన్‌ ఒకటి నుంచి జూలై ఒకటో తేదీ వరకు జిల్లాలో కేవలం పదిరోజులే వర్షం నమోదైంది. జూన్‌ 5న చిరుజల్లులు ప్రారంభమైనా.. అన్ని మండలాలను తడపలేదు. ఇప్పటివరకు సాధారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 588.1 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 95.8 మి.మీ. లోటు ఏర్పడింది. ఈసారి మోస్తరు కాకుండా చిరుజల్లులే కురవడంతో వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడలేదు. నేలలో తేమ నిలవడం లేదు. విత్తనాలు ఎండిపోవడం, నారుమడులు సిద్ధం కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వారం రోజుల్లో భారీవర్షాలు కురవకపోతే వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎదురైతే దిగుబడి తగ్గే ప్రమాదంతోపాటు పెట్టుబడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement