కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌టౌన్/కరీంనగర్ అర్బన్: వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సత్వర న్యాయం అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. కొత్తపల్లిలోని భరోసా సెంటర్‌లో సీపీ గౌస్ ఆలం అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే బాధితులకు తక్షణ సాయం అందించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ భరో సా సెంటర్ బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికపై పోలీసు, వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవలను అందించే సమగ్ర వ్యవస్థ అ న్నారు. ప్రతి కేసును మానవీయ కోణంలో పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పనిచేస్తామన్నారు. జూలై 1 నుంచి 31వరకు జరిగే ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సప్తగిరికాలనీలోని సఖి సెంటర్‌ను కలెక్టర్, సీపీ సందర్శించారు. కేంద్రంలో బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కేసు ల నిర్వహణ, అత్యవసర సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ బాధితురాలికి ధైర్యం చెప్పి, వారి సమస్యలను పరిష్కరించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సెంటర్‌లోని రికార్డ్స్ విభాగం, అడ్మినిస్ట్రేటర్ గది, షెల్టర్ గదులను పరిశీలించి, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికతో మాట్లాడారు. శిక్షణ కలెక్టర్ హరిప్రసాద్, డీసీపీ వెంకటరమణ, సంక్షేమ అఽ దికారి సరస్వతి, డీఎంహెచ్‌వో శ్రీరామ్ ఉన్నారు.
మార్కెట్ యార్డును ఆధునీకరిస్తాం
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. యార్డు పరిశుభ్రతతో పాటు అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సన్న ఉన్నారు.


