కన్నెపల్లి నీటితో మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీని నింపాలి
సర్ పూర్తయ్యేవరకు వరకు అప్రమత్తంగా ఉండాలి
బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్‌టౌన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేశాడని, రెండున్నరేళ్లలో మరమ్మతు చేయకుండా వదిలిపెట్టి బురద రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు గేట్లను మరమ్మతు చేసి ఉంటే హైదరాబాద్‌కు, రాష్ట్రానికి తాగునీరు, 50వేల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చేసి మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ నింపి వరదకాలువల ద్వారా అనంతగిరి వరకు సాగు, తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు, బోనస్ ఇవ్వనందుకు, యూరియా కోసం గోస పెడుతున్నందుకు కాగడాలతో రైతులు తరుముతారని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఓటర్ల పేర్లను తొలగించే అవకాశాలున్నందున బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు, ప్రతి డివిజన్‌లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సర్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయించాలన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు ఎండిపోయాయని, సాగు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సర్దార్ రవీందర్‌సింగ్, కొండూరు రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


