● తిమ్మాపూర్‌లో ఘటన ● ప్రయాణికులకు స్వల్ప గాయాలు ● తృటిలో తప్పిన పెను ప్రమాదం
తిమ్మాపూర్: కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటన తిమ్మాపూర్‌లోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు మధ్యాహ్నం హైదరాబాద్ వైపు వెళ్తోంది. దాని ముందుగా వెళ్తున్న నూతన లారీ ఫిట్‌నెస్ పరీక్ష కోసం ఆర్టీవో ఆఫీస్ వైపు డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుంటోంది. వెనకాలే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆటో డ్రైవర్లు, కళాశాల విద్యార్థులు కలిసి బస్సులో ఉన్న 47 మందిని ఎమర్జెన్సీ విండో నుంచి బయటికి దింపేశారు. తిమ్మాపూర్ సీఐ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


