ఆక్రమణలపై అర్జీల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై అర్జీల వెల్లువ

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

● ప్రజావాణిలో బాధితుల గోడు ● సమస్యలు పరిష్కరించాలని నివేదన కన్నీరు పెట్టినా.. కనికరించరా..? కాలేజీలో టీసీ ఇస్తలేరు దారినే కబ్జా చేశారు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు

‘నా సొంత స్థలంలో సంబంధం లేని వ్యక్తులు నిర్మాణం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ఓ వృద్ధుడు ప్రజావాణిలో కన్నీటి పర్యంతమయ్యాడు. క్యూలైన్‌ నుంచి కలెక్టర్‌ వద్దకు చేరుకునే వరకూ నేను వృద్ధుడిని, నన్నెవరూ పట్టించుకోవడం లేదంటూ రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన గాజర్ల వెంకట్‌రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్‌ 6,7లో భూమి ఉంది. అక్కడే ఇంటిని నిర్మించుకుని 40ఏళ్లుగా జీవనం చేస్తున్నాడు. తన భూమిపై ఎలాంటి హక్కు లేని వ్యక్తులు దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శిని కలిస్తే తానేం చేయలేనని, అధికారులకు చెప్పుకో అంటున్నాడని వాపోయాడు.

కరీంనగర్‌ అర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కలెక్టరేట్‌ బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఎక్కువ శాతం, భూ సమస్యలు, ఆక్రమణలుపైనే బాధితులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 225 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు.

మాది పేద కుటుంబం. నా తల్లిదండ్రులు నన్ను ఉన్నత చదువులు చదివించాలని అల్గునూరులోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో జాయిన్‌ చేశారు. గతేడాది ఇంటర్‌లో చేరగా నేను కాలేజీకి వెళ్లింది 20రోజులే. తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో భయమేస్తోంది. నేను కాలేజీకి రాను టీసీ కావాలని అడిగితే పూర్తి ఫీజు చెల్లించాలని వేధిస్తున్నారు. కలెక్టర్‌ మేడమ్‌ నాకు న్యాయం చేయాలి. – కృపాసాగర్‌, విద్యార్థి, రామన్నపేట

గ్రామ శివారులో సర్వే నంబర్‌ 206, 207లో 16 ఎకరాల భూమి ఉంది. గత 50ఏళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఉత్తరం వైపు ఒద్యారం నుంచి ఖాజీపూర్‌ వచ్చే తోవ ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. గ్రానైట్‌ కంపెనీవాళ్లు తోవను దౌర్జన్యంగా తొలగించి ఆక్రమించుకున్నారు. ఇంత దౌర్జన్యమా..? అధికార యంత్రాంగం ఎందుకున్నట్లు? – విద్యాసాగర్‌,

వేణుగోపాల్‌, ఒద్యారం, గంగాధర

గ్రామంలో 312 సర్వే నంబర్‌లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అందులో ఉన్న వేప, తుమ్మ చెట్లను తొలగించి భూమిని చదును చేశారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చర్యలుండవా.? తిరిగి స్వాధీనం చేసుకోరా..?

– ఖాజీపూర్‌ గ్రామస్తులు, కొత్తపల్లి మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement