గందరగోళం సర్‌ | - | Sakshi
Sakshi News home page

గందరగోళం సర్‌

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

● ఓటర్లు దొరక్క బీఎల్‌వోలు ● ఫారం ఎలా నింపాలో తెలియక ఓటర్లు ● మీడియాకు వివరాలు ఇవ్వని ఉన్నతాధికారులు

కరీంనగర్‌ అర్బన్‌: పల్లె నుంచి నగరం వరకు ఎక్కడైనా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) చర్చే. 2002.. ఓటర్ల గుండెల్లో గుబులు రేపుతుంటే ఓటర్లు దొరక్క బీఎల్‌వోలు అయోమయానికి గురవుతున్నారు. పక్కాగా ఓటరు జాబితా రూపొందించేందుకే సర్‌ను చేపడుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుండగా, సందేహాలను తీర్చాల్సిన ఉన్నతాధికారులు మీడియాకు సమయం ఇవ్వడం లేదు. ఎన్యుమరేషన్‌ ఫారాలను పూరించడం ఓటర్లకు ఇబ్బందికరంగా మారింది. క్యూఆర్‌ కోడ్‌తో ముద్రితమైన ఈ పత్రంలో చిన్నతప్పు చేసినా ఓటు విషయంలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. అందుకనే వాటిని నింపడానికి ఓటర్లు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. చదువుకున్న వారూ అందులోని వివరాలను రాయడానికి తటపటాయించాల్సి వస్తోంది.

ఫారాలు నింపడంలో ఓటర్ల అవస్థలు

జిల్లాలో 1,334మంది బీఎల్‌వోలు వారి వద్ద ఉన్న ఎన్యూమరేషన్‌ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున 800– 900 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. 2002 జాబితాలో ఉన్న ఓటర్లు, తాజా జాబితాలో ఉన్న ఓటర్లకు ఒకే రకమైన ఫారాన్ని ఇస్తున్నారు. అందులో వేర్వేరుగా నింపాల్సి ఉంటుంది. ఎక్కువమంది ఈ విషయంలో అవగాహన లేక పత్రాలు నింపడం లేదు. చాలామందికి ఎపిక్‌ నంబర్‌ను ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. బీఎల్‌వోలకు ఇప్పటికే అందుకు సంబంధించి సమగ్ర శిక్షణనిచ్చారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఓటర్లు అడిగే పలు సందేహాలు నివృత్తి చేసేందుకు వారు ఉన్నతాధికారులపై ఆధారపడుతున్నారు. నియోజకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, బంధుత్వం తదితర వివరాలు ఎలా పొందుపర్చాలనేది కొన్నిచోట్ల బీఎల్‌వోలకు తెలియడం లేదు.

ఓటర్లు దొరకట్లే

చాలా చోట్ల ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన ఉండటం లేదు. కొన్నిచోట్ల పార్టీ నాయకులు హుషారుగా ఓటర్లు, ఇంటి యజమానుల వివరాలు, ఫోన్‌ నంబర్లను బీఎల్వోలకు అందిస్తున్నారు. బీఎల్వోలకు 1,200 వరకు ఓటర్ల వివరాలు నమోదు చేయాలని సూచించడంతో ఇబ్బందులు పడుతున్నారు. సహకరించాల్సిన బీఎల్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. బీఎల్వోలు ఓటర్ల జాబితా పట్టుకొని ఇంటింటికీ తిరుగుతుండగా వృద్ధులు మాత్రమే ఇంటి వద్ద ఉంటున్నారు. మిగతా వారు ఎక్కడున్నారని అడిగితే వలస వెళ్లారని సమాధానమిస్తున్నారు. గత్యంతరం లేక బీఎల్వో ఉన్నవారికే ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించి వెనుదిరుగుతున్నారు. ఒక్కో బీఎల్వో నిత్యం 200 మంది ఓటర్ల వివరాలు ఈఎస్‌ఐ యాప్లో సరి చూడాలి. వీరు మొదట ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించాలి. 2002, 2025లో ప్రచురించిన ఓటర్ల జాబితాలోని పేర్లను సరి చూడాలి. ఆ సమయంలో ఎక్కడ ఓటు వేశారు? ప్రస్తుతం వారు ఎక్కడున్నారు? ఎవరైనా మృతి చెందారా? పెళ్లి చేసుకొని వెళ్లిపోయారా? వంటి విషయాలను గమనించాలి. ఓటర్లకు ఇచ్చిన ఫారాల్లో 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలు పొందుపరిచి, ఒక పీపీసైజ్‌ ఫొటోను అతికించి బీఎల్వోలకు అందించాలి. కానీ, చాలాచోట్ల ఇళ్లలో ఇంటి యజమానులు కనిపించడం లేదు. చాలా ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement