● సేద్యానికి సిద్ధమవుతున్న రైతన్న ● సన్నాల సాగుకు పెరిగిన డిమాండ్
● ఏడు రకాల సన్నాలకే బోనస్ ● నేడు ఏరువాక పున్నమి
విద్యానగర్(కరీంనగర్): ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ట మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. ఏరువాకతోనే వ్యవసాయ పనులు మొదలవుతాయి. నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా కథనం.
ఏరువాక అంటే..
అన్నదాతలు ఏటా జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు జరుపుకునే పండుగ. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దుల కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించి వాటికి భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేస్తారు. దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య సాగు పనులు మొదలుపెడతారు.
దేశమంతటా..
ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జ్యేష్టమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడిపంటలకు, పొలం పనులకు ఆటంకాలు ఎదురుకావద్దని ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లలో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగాను భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ రోజే ఒడిశాలోని పూరీ జగన్నాఽథునికి స్నానోత్సవం నిర్వహిస్తారు.
జాడ లేని చినుకు
నైరుతి రుతుపవనాలు జూన్ ప్రారంభంలో కేరళను తాకడంతో వర్షాకాలం మొదలవుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో రుతుపవనాలు జూన్ మొదటి లేదా రెండో వారంలో విస్తరిస్తాయి. ఈ సీజన్‌లో జూన్ గడిచినా ఇప్పటి వరకు చినుకు జాడ లేక రైతన్న కళ్లలో వత్తులు వేసుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారి ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వర్షాలు కురువాలని వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం ఒక్క పదును వర్షం కూడా కురవకపోవడంతో సాగు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాతావరణ పరిస్ధితులు వెక్కిరిస్తుండడంతో వ్యవసాయశాఖ రాయితీపై ఎరువులు, విత్తనాలు మంజూరు చేసినా తెచ్చుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
సన్నాలతో లాభాలు, ప్రభుత్వ ప్రోత్సాహం
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్నరకాల వరి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది 33 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి 7 రకాలకే బోనస్ ప్రకటించి వాటి సాగును ప్రోత్సహిస్తు రైతు వేదికపై విత్తనాల పంపిణీ సైతం ప్రారంభించింది. ఈ రకాలకు నీటి వినియోగం తక్కువతోపాటు అధిక దిగుబడి, మిల్లింగ్ చేస్తే అధిక బియ్యం రావడం ప్రత్యేకత. సాంబామసూరి, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్, కూనారం సన్నాలు, సిద్ది, కేఎన్‌ఎం– 7715 (కొత్తతరం సన్న రకం) విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.


