కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన పోతు ప్రణీత్ (11) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల మేరకు.. మానేరు డ్యాంలో మేకలు కాసేందుకు తాతతో వెళ్లిన బాలుడిపై శనివారం సాయంత్రం ఉరుములతో కూడిన పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్ చౌరస్తావద్ద ఆదివారం బైక్‌ను టిప్పర్ ఢీకొన్న ఘటనలో వరాల కొమురయ్య (54) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గౌరెడ్డిపేటలో వ్యవసాయ పనుల కోసం బైక్‌పై బయల్దేరిన కొమురయ్యను వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన కొండవేన పోశాలు(56) ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో మోటారు చెడిపోయింది. మరమ్మతు కోసం పోశాలు బావిలోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడా..లేదా విద్యుత్ షాక్‌తో మృతిచెందాడా.. అనే విషయమై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య పద్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ రామకృష్ణను వివరణ కోరగా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
మీర్జంపేట ఎల్లమ్మ గుడిలో చోరీ
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని మీర్జంపేటలో రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిలో దొంగలు సుమారు రూ.50 వేలు విలువ చేసే పుస్తెల తాడు, మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఆదివారం గీతకార్మికులు అమ్మవారి మెడలో గొలుసు చోరీకి గురైనట్లు కనుగొని సర్పంచుకు సమాచారం అందించారు. సర్పంచు శైలజ సదానందం గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సందిల్ల శివాలయం, కాల్వశ్రీరాంపూర్ రామాలయంలో దేవుడి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనలు జరిగాయి.
షార్ట్ సర్క్యూట్‌తో మెస్ దగ్ధం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి క్రాస్‌రోడ్ సమీపంలో గల శ్రీలక్ష్మి మెస్ లో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆదివారం మెస్‌ను మూసి ఉంచగా.. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు భావిస్తున్నారు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారి రాజేందర్ తెలిపారు.
దాతలు.. దయచూపరూ..
జగిత్యాలరూరల్: పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అతడికి వైద్యం చేయించేందుకు ఆ కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోట హరీశ్ జగిత్యాల పరిధిలో విద్యుత్ బిల్లులు కొట్టే స్పాట్ బిల్లర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 18న హన్మాజీపేట శివారులో అతని ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోగా, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ మెడికల్ కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం అతను కోమాలో ఉండటంతో రోజుకు రూ.30 వేల వైద్య ఖర్చలవుతున్నాయి. నిరుపేద కుటుంబం కావడంతో ఎవరైనా మానవతా దృక్పథంతో ఆర్థికసాయం చేస్తే అతని ప్రాణాలు కాపాడవచ్చు. దాతలు ఆదుకోవాలని, వివరాలకు 91009 12072 నంబర్‌లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


