పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జంక్షన్ రైల్వేస్టేషన్‌లో అమృత్‌భారత్ పథకం కింద చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. వివిధమండలాలు, గ్రామాలతోపాటు పొరుగు జిల్లాలకు చెందిన ప్రజలు దూర, సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేలా సకల సౌకర్యాలతో రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. తొలుత అభివృద్ధి పనులు నెమ్మదించినా, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రయాణికులు, రైల్వే ఫోరం సంఘాల నాయకులు, డీఆర్‌యూసీసీ సభ్యులు పనులను వేగంగా చేసేలా చూడాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పనులు ఊపందుకున్నాయి.
సోలార్ సిస్టం ఏర్పాటు
రైల్వేస్టేషన్ ఎదుట వాహనాల పార్కింగ్ కోసం సోలార్‌ప్లేట్లతో కూడిన షెడ్ ఏర్పాటు చేశారు. వాటికి సమీపంలోని రైల్వే క్వార్టర్లపై కూడా సోలార్ ప్లేట్లు అమర్చారు. సూర్యవిద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేసిన షెడ్ల కింద వాహనాలను నిలిపి ఉంచుతున్నారు.
మారుతున్న రూపురేఖలు
అభివృద్ధి పనులతో రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ప్రధాన ముఖద్వారం పనులు పురోగతిలో ఉన్నాయి. లిఫ్ట్, ఎస్కలేటర్ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు ప్లాట్‌ఫామ్స్, బోగీలు నిలిచే సంఖ్యను సూచించే బోర్డులు, ఇతర సేవలను సులువుగా గుర్తించేలా కొత్త సైన్‌బోర్డులు సైతం అమర్చారు. రైల్వేస్టేషన్ ముందు చేపట్టిన గూడ్స్‌షెడ్ పనులు కూడా పూర్తయ్యాయి. వానలు కురిసినా, ఎండలు దంచి కొట్టినా ఇబ్బందులు లేకుండా బియ్యం, ఎరువులు లాంటి తదితర నిల్వలను లోడింగ్, అన్‌లోడింగ్ చేసేందుకు వీలుగా చేపట్టిన పనులు పూర్తయ్యాయి.
ఆకర్షణీయంగా ‘పెద్ద’పల్లి జంక్షన్
ఖాజీపేట–బల్హార్ష సెక్షన్‌లో రైలు ప్రయాణం చేసేవారికి నిర్మాణాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది పెద్దపల్లి రైల్వేస్టేషన్ అని గుర్తించేలా కనిపిస్తున్నాయి. వీటికితోడు సమీపంలోనే చేపట్టిన రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావొస్తుండడంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చురుకుగా జరుగుతున్నాయని, కొద్దిమాసాల్లోనే అందుబాటులోకి వస్తాయని డీఆర్‌యూసీసీ సభ్యుడు ఎన్‌డీ తివారీ తెలిపారు.
వేగంగా రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు
ప్లాట్‌ఫామ్స్‌పై సైన్‌బోర్డుల ఏర్పాటు


