జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్రంలోని వ్యవసాయ, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బైపీసీ చదివి తెలంగాణ ఎప్‌సెట్–2026(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కోర్సుల వ్యవధి నాలుగేళ్లు.
సీట్ల వివరాలు
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా పొలాస, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం, వరంగల్ అర్బన్ జిల్లా, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, సూర్యపేట జిల్లా హుజుర్‌నగర్, వికారాబాద్ జిల్లా కొడంగల్, నిజామాబాద్‌లో పది అగ్రికల్చర్ కళాశాలలు ఉండగా, 855 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 500 సెల్ఫ్ ఫైనాన్స్ (పేమెంట్) సీట్లు ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బీఎస్సీ(హార్టికల్చర్) కళాశాలో 30, నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో 25 సీట్లు, వీటికి అదనంగా 4 ఫేమెంట్ సీట్లు ఉన్నాయి. అన్ని కోర్సుల్లో ఫేమెంట్ సీట్లను సైతం తెలంగాణ ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు.
జూలై 25 చివరి తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి. సీటు వచ్చిన సమయంలో.. వ్యవసాయ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ కోర్సులకు రూ 50,740, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులో పేమెంట్ సీట్లకు రూ.1,12,790 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ సీట్లకు సంబంధించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫీజు చెల్లింపునకు జూలై 24, ఆన్‌లైన్ దరఖాస్తు పంపేందుకు జూలై 25 చివరి తేదీ.
అర్హతలు
ఆయా కోర్సులకు జనరల్ అభ్యర్థుల వయస్సు 17 ఏళ్లు పూర్తయి 22 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 25, పీహెచ్‌లకు 27 ఏళ్ల వరకు అనుమతి ఉంటుంది. వ్యవసాయ కోర్సుల్లో 25 శాతం సీట్లు రైతుల పిల్లలకు, రైతు కూలీల పిల్లలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే, ఆ భూమి విద్యార్థి పేరు మీద లేదా తల్లితండ్రుల పేరిట పట్టా ఉండాలి. ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్ల పాటు నాన్ మున్సిపల్ ఏరియా (గ్రామీణ ప్రాంతం)లో చదివి ఉండాలి. పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీజేటీఎస్‌ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు


