జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని మడిపల్లి, అంకూషాపూర్ గ్రమాల మధ్య శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండలంలో కలకలం రేపింది. టౌన్ సీఐ రామకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాలు.. మడిపల్లి గ్రామానికి చెందిన పైతరి మొగిలి (52) కొన్నేళ్లుగా అంకూషాపూర్ గ్రామంలో కూలీగా, వ్యవసాయ పాలేరుగా పని చేస్తూ ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి మడిపల్లి గ్రామంలో జరిగిన పీరీల పండుగకు సైకిల్‌పై వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా రెండు గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో మొగిలిపై దాడి చేయగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలాన్ని ఏసీపీ మాధవి పరిశీలించారు. తన భర్త హత్యపై మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేశ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తెలిపారు.
పాత కక్షలే కారణమా..?
గతంలో అంకూషాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళపై పైతరి మొగిలి లైంగికదాడికి యత్నించాడనే ఫిర్యాదుతో కేసు నమోదు కాగా జైలుకు వెళ్లి ఇటీవల వచ్చాడు. ఆ కేసుకు సంబంధించిన పాత కక్షలతో మొగిలి దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
దొంగిలించిన వాహనం బోల్తా..?
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి వద్ద శనివారం అర్ధరాత్రి ఆటో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. వాహనం వద్ద ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు ఆరా తీయగా, శనివారం జగిత్యాలలో చోరీకి గురైన పెద్దూరు రామస్వామికి చెందిన వాహనంగా గుర్తించారు. బ్రిడ్జి వద్ద సైడ్ వాల్ నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పలు వాహనాలు కూడా ఇలాంటి ప్రమాదాలకు గురయ్యాయి.


