విద్యానగర్(కరీంనగర్): సర్కారు బడి మెరుగు పడింది. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్‌రూంలు, ఉచితంగా పుస్తకాలు.. దుస్తులు, షూలతో పాటు ఉదయం అల్పాహారం.. మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు బడిలో గతం కన్నా అత్యుత్తమ బోధన అందుతుండడంతో అడ్మిషన్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలను వీడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రీ ప్రైమరీ మొదలు అన్ని తరగతుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఫీజులు భారమై..
మాది పేద కుటుంబం. మా నాన్న కష్టపడి 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదివించాడు. ఇప్పుడు ఫీజు ఎక్కువ అడగడంతో, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచిగా చదువు చెబుతున్నారని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ నేను చదివిన ప్రైవేట్ స్కూల్ కన్నా పాఠాలు మంచిగా చెప్పుతున్నారు. అర్థం కాలేదంటే మళ్లీ వివరిస్తున్నారు. ఫీజులు లేవు. అన్ని ప్రభుత్వమే ఇస్తుంది. ఇక్కడే బాగుంది.
– వరుకోలు సమన్విత్, 8వ తరగతి, సప్తగిరికాలనీ హైస్కూల్
ఫలితాలు బాగున్నాయి
7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదివాను. ప్రస్తుతం సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. ఫీజులు ఉండవు. పైగా ఇక్కడ టీచర్లు మంచిగా చెప్పుతున్నారు. పదో తరగతి ఫలితాలు బాగా వచ్చాయని అందరూ చెప్పడంతో నన్ను మా నాన్న ఇక్కడ చేర్పించారు. ప్రైవేట్ స్కూల్ కన్నా
ఇక్కడే బాగుంది.
– తిప్పారపు శ్రీలోహిత, 8వ తరగతి, సప్తగిరికాలనీ హైస్కూల్
కరీంనగర్‌లోని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 27 అడ్మిషన్లు జరిగాయని ప్రధానోపాధ్యాయుడు ముర్మూరి రాజేందర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఆరోతరగతిలో 10 మంది, ఏడోతరగతిలో నలుగురు, ఎనిమిదో తరగతిలో ఎనిమిది మంది, తొమ్మిదవ తరగతిలో ఇద్దరు, పదోతరగతిలో ముగ్గురు చేరారని వివరించారు. ఇంకా 20 మంది వరకు చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నగరంలోని కార్ఖానాగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మంది చేరారని ప్రధానోపాధ్యాయుడు సంగోజు సత్యనారాయణ చారి తెలిపారు. 6వ తరగతిలో 10 మంది, ఏడోతరగతిలో నలుగురు, ఎనిమిదో తరగతిలో నలుగురు చేరారని, మరో 10 మంది చేరడానికి సిద్ధం అవుతున్నారని వివరించారు.
నగరంలోని మంకమ్మతోట బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల తెలిపారు. ముగ్గురు బాలికలు 6వ తరగతిలో చేరారని తెలిపారు. మరో ఐదుగురు చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
నగర పరిధిలోని ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 13 మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్‌ఎం ఎస్.శ్రీనివాస్ తెలిపారు. వీరిలో 6వ తరగతిలో ఏడుగురు, 7వ తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ముగ్గురు, 9వ తరగతిలో ఒక్కరు చేరారన్నారు. ఈ నెలాఖరు వరకు మరో 10 మంది వరకు రావొచ్చని తెలిపారు.


