సాగునీరు ఇవ్వకుంటే పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

సాగునీరు ఇవ్వకుంటే పాదయాత్ర

Jun 29 2026 1:41 AM | Updated on Jun 29 2026 1:41 AM

● రైతులపై సీఎం రేవంత్‌రెడ్డిది కక్ష సాధింపు ● వరద కాలువ వద్ద మహాధర్నాలో కరీంనగర్‌ ఎమ్మెల్యే కమలాకర్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): మేడిగడ్డ పంప్‌హౌజ్‌ నుంచి వరదకాలువ ద్వారా కరీంనగర్‌ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు ఇవ్వకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపడతామని కరీంనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అల్టిమేటం జారీ చేశారు. గోదావరి నుంచి 12వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీటిని మళ్లిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే సీఎం రేవంత్‌ రెడ్డి రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామ శివారులోని వరద కాలువ తూం వద్ద నియోజకవర్గ రైతులు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌తో కలిసి ఆదివారం వంటావార్పు, సహపంక్తి భోజనం, మహాధర్నా చేపట్టారు. కొత్తపల్లి మండలం నాగులమల్యాల, బద్దిపల్లి, బావుపేట, ఎలగందుల, కమాన్‌పూర్‌, మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌ గ్రామాలకు వరదకాలువ తూము నుంచి నీటి మళ్లింపు ప్రక్రియను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చెరువులు, కుంటలు మత్తడి దునికిస్తే.. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో కరువు వచ్చి రైతులు నారు పోసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారంలోగా ప్రభుత్వం స్పందించి వరద కాలువ తూము ద్వారా నీటిని విడుదల చేయాలని, లేకపోతే వరద కాలువలో 50 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటి ఎత్తిపోస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కేటీఆర్‌, హరీశ్‌ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి మోటార్లు ఆన్‌ చేసి రైతులకు నీరందిస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement