ఖాకీల్లో కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

ఖాకీల్లో కుమ్ములాట

Jun 29 2026 1:41 AM | Updated on Jun 29 2026 1:41 AM

● రోడ్డుపై వివాదం ఘటనలో ఐదుగురు రిజర్వ్‌డ్‌ పోలీసులపై చర్యలు? ● ముగ్గురిపై శాఖాపరమైన నివేదిక, ఇద్దరిపై క్రిమినల్‌ కేసు

కరీంనగర్‌ క్రైౖం: ఇద్దరు యువకులతో పోలీసులకు జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతోంది. కరీంనగర్‌ పోలీసు ట్రైనింగ్‌ కళాశాల(పీటీసీ)కు చెందిన ఐదుగురు పోలీసు అధికారుల భవిష్యత్‌ ను ప్రశ్నార్థకంలోకి నెట్టింది. రోడ్డుపై జరిగిన చిన్నపాటి గొడవతో ప్రారంభమైన వ్యవహారం, వైరల్‌ వీడియో, పరస్పర ఆరోపణలు, బ్లాక్‌మెయిల్‌ కుట్ర కేసులు, శాఖాపరమైన విచారణల వరకు వెళ్లడం పోలీసుశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఏం జరిగిందంటే..

ఈ నెల 19న నగరంలోని మంకమ్మతోటలో రోడ్డు పై బైక్‌ అడ్డుగా పెట్టడంతో పీటీసీకి చెందిన ఆర్‌ఐ, ఇద్దరు ఆర్‌ఎస్సైలతో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సివిల్‌ డ్రెస్సులో ఉన్న పోలీసులను గుర్తించని యువకుల్లో ఒకరు కర్రతో దాడి చేయడంతో ఆర్‌ఐ, ఆర్‌ఎస్సైలకు గాయాలయ్యాయి. యువకుడిని వెంటాడి నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి చితకబాదిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

ముగ్గురిపై నివేదిక.. మరో ఇద్దరిపై క్రిమినల్‌ కేసు

ఈ ఘటనపై ఆర్‌ఐతో పాటు ఇద్దరు ఆర్‌ఎస్సైలపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అయితే వైరల్‌ అయిన సీసీ కెమెరా వీడియోను ఆధారంగా చేసుకుని పీటీసీలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్‌ఎస్సైలు సహచర అధికారులను ఇరికించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. వీడియోను చూపిస్తూ ఒక్కో అధికారిని రూ.5 లక్షలు ఇవ్వాలని యువకుల ద్వారా బెదిరించినట్లు ఆర్‌ఐ ఫిర్యాదుతో ఈనెల 25న ఇద్దరు ఆర్‌ఎస్సైలపై టూ టౌన్‌లో నేరపూరిత కుట్ర, ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఐదుగురిపై చర్యలు?

ఒకే ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణ, మరో ఇద్దరు క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటుండటంతో డిపార్టుమెంట్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా సదరు అధికారులపై సస్పెన్షన్‌, క్రమశిక్షణ చర్యలు లేదా ఇతర పరిపాలనా నిర్ణయాలు తీసుకునే ఉందని సమాచారం. సహచర అధికారుల మధ్య వ్యక్తిగత విభేదాలు, పరస్పర కక్షలు ఇంత తీవ్రస్థాయికి చేరుకోవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకే ఘటనలో ఐదుగురు అధికారులు విచారణను ఎదుర్కొనడం హాట్‌టాపిక్‌గా మారింది. మొత్తంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకపాలాలకు దిగడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉండగా.. అంతర్గత కుమ్ములాటలు ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా తయారయ్యాయని పలువురు పోలీసులు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement